– ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
రామగిరి, జనవరి 13 : మహిళల్లో చైతన్యాన్ని వెలికితీని పోటీ తత్వాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలుగా ముగ్గుల పోటీలు నిలుస్తాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలం జి.కె. అన్నారం గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ మహా సభలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధికి దారితీస్తుందన్నారు. ముగ్గుల పోటీల్లో గ్రామీణ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు.
పాలకవర్గాలు మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు పటిష్ట పాత్ర పోషించాలని కోరారు. మహిళలను “కోటీశ్వరులు చేస్తాం” అనే వాగ్దానాలు పేరుకు మాత్రమే మిగలకూడదని వ్యాఖ్యానించారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వారికి తగిన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి అక్షయ, రెండో బహుమతి చైతన్య, మూడో బహుమతి కౌసల్య కు అందించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, గీతా కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, గ్రామ సర్పంచ్ మైలా మల్లికార్జున రెడ్డి సుగుణమ్మ, భిక్షతమ్మ, సుమలత, జ్యోతి, పూజ స్వాతి, రాములమ్మ సృజన పాల్గొన్నారు.

Ramagiri : ‘మహిళల్లో చైతన్యం, పోటీతత్వం పెంపునకు ముగ్గుల పోటీలు దోహదం’