దామరచర్ల, నవంబర్ 20 : పెన్నా సిమెంటు కర్మాగారం నాడు స్థానికులకు ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కారం తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. దామరచర్ల మండలంలోని గణేశ్‌పహాడ్ గ్రామ శివారులో పెన్నాసిమెంటు ఫ్యాక్టరీని 2004 సంవత్సరంలో తొలుతగా చాణక్య సిమెంటు పేరుతో నెలకొల్పారు. తర్వాత పెన్నా సిమెంటుగా పేరు మార్చారు. కర్మాగారం యాజమాన్యం స్థానికలను మభ్యపెడుతూ సిమెంటు పరిశ్రమలను నడుపుతున్నది. ఇటీవల పెన్నా సిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి అంబుజాగా పేరుమార్చుకుంది. పెన్నా సిమెంటు మైనింగ్ లీజు గడువు గత 2022తో ముగియడంతో కొంతకాలం అనధికారికంగా నడిపింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు నిర్వహించి సిమెంటు ఉత్పత్తిని నిలుపుదల చేసింది. పెన్నాను అదానీ కొనుగోలు చేసి తన సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 304 హెక్టార్ల భూమిలో, సూర్యాపేట జిల్లా శూర్నేపహాడ్ గ్రామ పరిధిలో 50 హెక్టార్ల మైనింగ్ నాపరాయి గనుల విస్తీర్ణాన్ని 1.5 మిలియన్ టన్నుల నుంచి 1.8 ఎంటీపీఎల్కు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు తొలుతగా ఈ నెల 12న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రకటించగా కొడంగల్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను ఈ నెల 29వ తేదీకి మార్చింది.
స్థానికులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు
పెన్నా సిమెంటు కర్మాగారం ఏర్పాటు దశలో 2008 నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేస్తామని నామమాత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారు. జనవరి 31, 2022 వరకు మైనింగ్ లీజు పూర్తి అయినా రాయిని అనధికారికంగా వెలికితీశారని, అటవీ భూములను ఆక్రమించి మైనింగ్‌లు ఏర్పాటు చేశారని, కర్మాగారంలో ఏర్పాటు చేసిన 66 మెగావాట్ల తర్మల్ విద్యుత్ ప్లాంటుకు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించలేదని, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేదని సామాజిక వేత్త నక్కాశ్రీనివాస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను నిలుపుదల చేయాలని హైకోర్టులో ఫిల్ దాఖలు చేయగా, అభిప్రాయ సేకరణ నిర్వహించుకోవాలని, అయితే పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని తీర్పునిచ్చింది. శూర్నేపహాడ్ నుంచి గణేశ్పహాడ్కు వెళ్లే రహదారి ఇరువైపులా మైనింగ్ ఏర్పాటు చేయడంతో తండా వాసులు అవస్థలు పడుతున్నారు.
కర్మాగారం ఏర్పాటుతో వృథాగా ఎత్తిపోతల
కర్మాగారం ఏర్పాటుకు ముందు గణేశ్‌పహాడ్ గ్రామంలోని గిరిజన రైతుల పొలాలకు నీరు అందించేందుకు నాటి ప్రభుత్వం సమీప మూసీ నది నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. సుమారు 250 ఎకరాల వరకు సాగులోకి వచ్చినప్పటికీ ఏడాది గడువక ముందే కర్మాగారం ఏర్పాటుతో సాగు చేసుకునే భూములన్నీ నాడు అతి తక్కువ ధరకే రైతుల నుంచి కంపెనీ కొనుగోలు చేసింది. దీనితో ఎత్తిపోతల పథకం వృథాగా మారింది. రైతులకు పంటలకు భూములు లేక, కర్మాగారంలో ఉద్యోగ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
మాట తప్పిన ఫ్యాక్టరీ యాజమాన్యం
సిమెంట్ కర్మాగారం యాజమాన్యం ప్రభావిత గ్రామాలకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఫ్యాక్టరీ పేర్లు మారుతున్నాయి. యాజమాన్యాలు మారుతున్నాయే తప్ప స్థానిక గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫ్యాక్టరీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేస్తున్నాం. లీజు పూర్తయినా అక్రమంగా రాయిని వెలికితీశారు. అటవీభూములను ఆక్రమించారు. కాలుష్యంతో మేము అల్లాడుతున్నాం. ఫ్యాక్టరీపై కోర్టులకు పోయినం. అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినం. మా సమస్యలన్నీ తీర్చాలి.. యువతకు ఉద్యోగాలు కల్పించాలి.
– నక్కా శ్రీనివాస్. శూర్నేపహాడ్
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసే సమయంలో మా తండాలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 25 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు నెరవేర్చలేదు. ఫ్యాక్టరీ కింద భూములు కోల్పోయాము. పంటలు లేక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నాం. కానీ మాకు న్యాయం జరుగలేదు. చదువుకున్న యువత కూలీలుగా పనికి పోతున్నారే తప్ప ఉద్యోగాలు కల్పించలేదు. మా సమస్యలన్నీ తీర్చిన తర్వాత అభిప్రాయ సేకరణ నిర్వహించాలి.
– కుర్రా లక్ష్మణ్‌నాయక్, గణేశ్‌పహాడ్