నడిగూడెం, జూలై 13 : ప్రతి ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం నడిగూడెం రాజావారి కోటలో కొమర్రాజు లక్ష్మణరావు సాహితీ, సాంస్కృతిక సమాఖ్య ఉత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె.జితేంద్రబాబు, దక్కన్ ఆర్కైవ్స్ అండ్ కల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కన్నెగంటి హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన సాహితీ వైతాళికుడు, తెలుగు భాష చరిత్రను జాతికి అందించిన కొమర్రాజు వెంకటలక్ష్మణరావు శత వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజ్ఞాన సర్వం సృష్టికర్త కొమర్రాజు వెంకటలక్ష్మణరావు అని పేర్కొన్నారు. సృష్టిలో ప్రాణి జీవనానికి అమ్మ ఎంతటి అవసరమో, అదే ప్రాణి జీవితంలో మనుగడ సాధించడానికి భాష అంతటి అవసరంగా గుర్తించగలిగిన రోజునే మాతృభాష కాపాడబడుతుందని పేర్కొన్నారు. మాతృభాషపై మమకారం పెంపొదించుకోవడంతోపాటు పట్టు సాధించే దిశగా నిరంతరం ప్రయత్నంగా ఉండాలని ఆకాంక్షించారు. అవసరం కోసమే పరాయి భాషను ఉపయోగించాలన్నారు. కొమర్రాజు వెంకటలక్ష్మణరావు శత వర్ధంతి సభను ఏర్పాటు చేసుకొని స్మరించుకోవడం అంటే మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నట్లవుతుందని తెలిపారు. ఏ దేశంలో ఉన్నా మాతృభాషను మరువద్దన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషను ప్రపంచానికి చాటి గొప్ప వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు అని పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేది భాషే అని అన్నారు. భాషపై పట్టు సాధించేందుకు నిరంతంరం కృషి చేయాలని సూచించారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి జ్యోతి ప్రజల్వన చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన జితేంద్రబాబును మంత్రులు కొనియాడారు. తెలుగు భాష తత్వ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
భాష మనిషి ఉనికిని కాపాడుతుంది : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నేటి కాలంలో భాషను కాపాడుకుంటే మనిషి ఉనికిని కాపాడుతుందని ఎమ్మెల్సీ గొరటి వెంకన్న అన్నారు. తెలుగు వారి అస్థిత్వాన్ని కాపాడేందుకు కొమర్రాజు ఎంతో కృషి చేశారన్నారు. కొమర్రాజు పుట్టకముందే భాషను కాపాడుకునేందుకు 1400 యక్ష జ్ఞానాలు ఉన్నాయని తెలిపారు. భాష, సాంస్కృతిక కేంద్రాలకు నడిగూడెం మూల బిందువుగా ఉంటుందన్నారు. కొమర్రాజు నడియాడిన ప్రాంతంలో ఆయన వర్ధంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పద్య, గద్య పాటలతో సభను ఉత్తేజపరిచారు.
కొమర్రాజును స్మరించుకోవడం సంతోషకరం : జూలూరు గౌరీశంకర్
తెలుగు భాషను కాపాడేందుకు కృషి చేసిన కొమర్రాజు వెంకటలక్ష్మరావును స్మరించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. చారిత్రక ప్రదేశంగా మునగాల పరగణా నిలుస్తుందన్నారు. తుపాకుల తూటాలకు మాటలు నేర్పినది నడిగూడనే అన్నారు. 125 గ్రంథాలయాల పుట్టుకకు కారణమైన వ్యక్తి కొమర్రాజు అని కొనియాడారు.
తెలుగు జాతి ప్రాభవానికి పునాది వేసింది ఇక్కడే : మండలి బుద్ధప్రసాద్
తెలుగు జాతి ప్రాభవానికి పునాది వేసిన ప్రాంతంగా నడిగూడెం నిలుస్తుందని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కొమర్రాజు శత వర్ధంతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని పోరాటం చేసిన వ్యక్తి కొమర్రాజు అని కొనియాడారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్‌కుమార్, జస్టిస్ రామలింగేశ్వర్రావు, ఐఏఎస్ ముక్తేశ్వర్రావు, తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడు సామల రమేశ్, ఆంధ్రపత్రిక సంపాదకులు మాశర్మ, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉమామహేశ్వర్రావు, నెలమల భాస్కర్, కవులు, అభిమానులు పాల్గొన్నారు.