సూర్యాపేట టౌన్, జూలై 22: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యూయలరీ దుకాణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొం గల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దొంగల ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు రెండు నెలల కిం దట పట్టణంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జ్యూయలరీ షాప్ సమీపంలోని నిర్మల మాత చర్చి వద్ద పాడుపడిన ఇంట్లో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు.
దుకాణాల వద్ద కాపలాదారులుగా ఉన్న వాచ్‌మెన్‌తో మాట్లాడుతూ పక్కగా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి సమపంలోని కిరాణ దుకాణంలో వాటర్ బాటిల్స్, గుట్కా ప్యాకెట్స్‌ను ముఠా కొనుగోలు చేసింది. ముఠా సభ్యులు అద్దె ఇంటిని సంపాదించడానికి స్థానిక యువకుల సహకారం తీసుకుంది. ఇంటి యజమాని ద్వారా యువకుల వివరాలు తెలుసుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. పలు సీసీ కెమెరాల ఫుటేజ్‌లను చూసి ముఠాలోని సభ్యులను స్థానిక యువకులు గుర్తించినట్లు సమాచారం.
ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహ నిందితుల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు రెండు బృందాలను ఉత్తరప్రదేశ్‌కు పంపినట్లు తెలిపారు. మరోవారంలో కొత్త గోల్డ్ షారూం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న దుకాణ యజమాని జ్యూయలరీ దుకాణంలో బంగారం నిల్వ చేసే తిజోరీని ఇటీవలే కొత్త షోరూంకి తరలించారు. తాత్కాలిక లాకర్లో బంగారం నిల్వ చేసి షట్టర్లో వేశారు. చోరీ జరిగిన దుకాణం ఉన్న ప్రాంతంలో ఆరు దుకాణ సముదాయం ఉన్నప్పటికీ వెనుక నిర్మానుష్య ప్రాంతం నుంచి ప్రవేశించిన దొంగలు బాత్రూం గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. దుకాణం గురించి పూర్తిగా తెలిసిన వారు ఇచ్చిన సమాచారంతోనే చోరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.