ఫైనాన్స్ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు కోళ్ల పెంపకంపై ఆసక్తి కొద్దీ హైఫై పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశాడు. కోళ్ల పెంపకంలో కష్ట, నష్టాలను, కూలీల కొరతను అధిగమించేలా పూర్తిస్థాయిలో ‘కంట్రోలింగ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేసుకున్నాడు. దానాతో పాటు నీరు, వాతావరణానికి తగ్గట్టుగా గాలిని అందిస్తున్నాడు. మొత్తం పెట్టుబడి రూ.70లక్షల వ్యయం కాగా ప్రతి బ్యాచ్‌లో రూ.70వేల పెట్టుబడితో రూ.2లక్షలకు పైగా లాభాన్ని పొందవచ్చని చెప్తున్నాడు. మండలంలోని టీ.రేపాక గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు యాస అంజిరెడ్డి, మహేందర్‌రెడ్డి వినూత్నరీతిలో కోళ్ల పెంపకంలో రాణిస్తున్నారు.
– ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 12
రైతు యాస అంజిరెడ్డి ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి వ్యవసాయం కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పౌల్ట్రీ రంగంపై ఆసక్తి కొద్దీ భారీ పెట్టుబడికి సిద్ధమయ్యారు. తమకున్న ఎకరం స్థలంలో రూ.70 లక్షలతో నాలుగు నెలల్లో అత్యాధునిక పౌల్ట్రీ ఫాం నిర్మించుకున్నారు.
తొలి విడుతలో 15 వేల కోడి పిల్లలు..
పౌల్ట్రీ ఫామ్‌లో తొలి విడుత బ్యాచ్‌లో 15వేల కోడి పిల్లలను పెంచారు. 35రోజుల్లో 2 కిలోల వరకు పెరుగగా.. అన్నింటినీ విక్రయించి తిరిగి రెండో బ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఫస్ట్ బ్యాచ్ పిల్లల కోసం రూ.70వేలు ఖర్చు చేశామని, 35రోజుల తర్వాత వాటిని అమ్మడంతో రూ.2.60లక్షల లాభం వచ్చిందని తెలిపారు.
ప్రతి బ్యాచ్‌లో రూ.2లక్షల 60వేల లాభం ..
ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేసిన నేను స్వతహాగా ఎదుగాలనే ఆలోచనతో పౌల్ట్రీ రంగంలోకి వచ్చాను. ఎంతోమంది రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మా నాన్న సహకారంతో ఎకరం స్థలంలో రూ.70 లక్షల ఖర్చుతో ఫాం ఏర్పాటు చేశాను. కోడి పిల్లల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయి. ఒక్కో బ్యాచ్ కోడి పిల్లలకు రూ.70వేల పెట్టుబడి పెడితే 35 రోజులకు 2 కిలోల వరకు ఎదుగుతాయి. మొత్తం రూ.2.60లక్షల లాభం వస్తుంది. ప్రస్తుతం ఒక బ్యాచ్ పూర్తయ్యింది. మరో బ్యాచ్ రెడీగా ఉన్నది.
– యాస మహేందర్‌రెడ్డి, పౌల్ట్రీ ఫాం నిర్వాహకుడు
కంట్రోల్ ప్యానల్ ద్వారా దానా, నీటి సరఫరా…
ఫాం నిర్వహణకు కూలీల అవసరం లేదని, కేవలం ఇద్దరు మనుషులతోనే మొత్తం పనులు పూర్తి చేయవచ్చని మహేందర్‌రెడ్డి తెలిపారు. కంట్రోల్ ప్యానల్ ద్వారా దానా, నీటిని అందింవచ్చని చెప్పారు. పిల్లల ఎదుగుదల కోసం అవసరమైన చల్లదనంతో పాటు వేడి గాలిని కూడా అందించేలా 8 ఎగ్జిస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగాలిని, తెల్లవారుజామున వేడిగాలిని అందిస్తూ టెంపరేచర్‌ను అదుపులో ఉంచుతాయి. పైగా కోడి పిల్లల విసర్జితాల నుంచి వచ్చే దుర్వాసన నిల్వ ఉండకుండా చెడు గాలిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దాంతో కోడి పిల్లలు ఆరోగ్యకరంగా ఎదుగుతున్నాయి.
ఆదాయం బాగుంది..
పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ ఎంతో బాగుంది. అధిక పెట్టుబడులతో వ్యవసాయం చేసినప్పటికీ కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రత్యామ్నాయ పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేయడం మంచిది. ఆ ఉద్దేశంతోనే ఎకరం స్థలంలో పౌల్ట్రీ ఫాం నిర్మించాం. నేను, నా కుమారుడు ఇద్దరమే ఫామ్‌ను నడిపిస్తున్నాం. పూర్తిగా కంట్రోల్ ఫ్యానల్తో దానా, నీళ్లు అందివ్వడం కొత్తగా ఉంది.
– యాస అంజిరెడ్డి, ఫౌల్ట్రీ ఫాం నిర్వాహకుడు