– కట్టంగూర్‌లో సర్వేయర్ లేక రైతుల ఇబ్బందులు
– భూ సర్వే కోసం తాసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
– పెండింగ్‌లో 80 దరఖాస్తులు
కట్టంగూర్, జూలై 19 : గ్రామీణ ప్రాంత రైతులకు సర్వే కష్టాలు తప్పడం లేదు. ప్రతి రోజు భూ సర్వే కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కట్టంగూర్ మండలానికి రెగ్యులర్ సర్వేయర్ లేకపోవడంతో ఇన్చార్జి సర్వేయర్‌ను నియమించడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. తాము మీ సేవలో దరఖాస్తు చేసుకుని నెలల తరబడి వేచిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సర్వేకు పెట్టుకున్న దరఖాస్తులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు భూ సర్వే కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అవి తాసీల్దార్ కార్యాలయంలో పెరిగిపోతున్నాయి.
కట్టంగూర్ మండల వ్యాప్తంగా సుమారు 80 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సంవత్సరం కాలంగా సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉంది. అనంతరం నకిరేకల్ సర్వేయర్‌ను ఇన్చార్జిగా నియయమించారు. అయితే ఆయన ఎప్పుడు వస్తున్నాడో.. ఎప్పుడు వెళ్తున్నాడో తెలియని దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. భూ సర్వే కోసం రైతులు మీ సేవలో రూ.295 చలాన్లు కట్టుకున్నప్పటికీ నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బులు వెచ్చించి ఇతర ప్రైవేట్ సర్వేయర్‌తో భూములను సర్వే చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ సర్వేయర్‌ను నియమించాలని రైతులు కోరుతున్నారు.