భువనగిరి అర్బన్, ఆగస్టు 13 : గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి.మాధవీలత అన్నారు. పట్టణంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావుతో కలిసి మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాల భవనం పాతది అవడం తో వానలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. భోజనంలో నాణ్యత లోపించిందని, పరిశుభ్రత పాటించడం లేదని చురకలు అంటించారు.
జిల్లావ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతుల కోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ, జిల్లా యం త్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాల, బాలికలకు న్యాయ సేవలు అందించడానికి బాలల చట్టపరమైన హక్కుల సాధికారతకు జాతీయ న్యాయ సేవా సంస్థ పథకం రూపొందించబడిందని, అందులో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆయా పాఠశాలలను సందర్శించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.