రామగిరి/నేరేడుచర్ల, డిసెంబర్ 30 : 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనం సిద్ధమవుతున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేందుకు ముఖ్యంగా యువ త ప్లాన్ చేసుకున్నారు. దాంతో విందు వినోదాలు పెద్ద ఎత్తున సాగనున్నాయి. స్వీట్లు, కేకులు, పటాకుల అమ్మకాలు జోరుగా సాగనున్నందున అందుకనుగుణంగా మార్కెట్లు సిద్ధమయ్యాయి. మం గళవారం సాయంత్రం నుంచే వేడుకల్లో జనం మునిగి తేలనుండగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, అర్ధరాత్రి తర్వాత బయ ట తిరుగొద్దని పలు నిబంధనలు విడుదల చేశారు. రాత్రి 10గంటల తర్వాత మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
పోలీసుల ఆంక్షలు ఇవే..
అర్ధరాత్రి బలాదూర్ తిరిగితే కఠిన చర్యలు
నీలగిరి, డిసెంబర్30 : నూతన సంవత్సర వేడుకల పేరుతో ఇష్టానుసారంగా అర్ధరాత్రి బలాదూర్ తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. అకారణంగా, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై సంచరిస్తే సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ పట్టణంలో డిసెంబర్ 31 వరకు ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా పట్టణంలో నేరాలు జరుగకుండా, యువకులు చెడు ధోరణుల వైపు వెళ్లకుండా, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉందని చెప్పారు.
జిల్లా కేంద్రంలో డీఎస్పీ శివరాంరెడ్డితోపాటు నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఇద్దరు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 98 మంది కానిస్టేబుళ్లు 13 చెకింగ్ బృందాలుగా ఉన్నారని, 10 పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతున్నాయని, మొత్తం నల్లగొండ పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారని పేర్కొన్నారు. ఆపరేషన్ చబుత్రతో ఇప్పటివరకు 128 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.1.20 లక్షలు, 62 ఈ పెట్టి కేసుల్లో రూ.56వేలు, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వందలాది వాహనాలను సీజ్ చేసి రూ.3.51లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ఏ ప్రమాదాలు, సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని కోరారు.