వేములపల్లి, ఏప్రిల్ 11: తండ్రి స్థానంలో ఉండి అన్ని తానై చూసుకోవాల్సిన మేనమామే కోడలిని బలవంతంగా లోబర్చుకొని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి ఏండ్లు గడుస్తున్నప్పటికీ అతడి ఆగడాలు ఆపకపోవడంతో విసుగు చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటుంది.
తమ కుమార్తెను కొన్నేళ్ల క్రితం దామరచర్లలో చదివించారు. ఆ సమయంలో ప్రతి ఆదివారం బాలికను చూసి రావాలని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన మేనమామ అయిన కోడిరెక్క నాగేందర్‌కు చెప్పారు. ప్రతి ఆదివారం పాఠశాలకు వెళ్లి బాలికను కలిసే అతడు ఆమె 8వ తరగతిలో ఉండగా లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పలుమార్లు బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నాడు. తరువాత బాలిక హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దనే ఉంటూ చదువుతోంది. ఈ క్రమంలో తనతోనే ఉండాలని, వివాహం చేసుకోవద్దని యువతిని వేధిస్తుండడంతో బాధితులు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి కేసు వేములపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా విచారణ చేపట్టి పోక్సో కేసు నమోదు చేసి.. నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.