ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూదాన్ పోచంపల్లి ఇకత్ చీరలకు గడ్డుకాలం దాపురించిందా..? పోచంపల్లి డిజైన్లకు ప్రింటెడ్ చీరలు ముప్పుగా మారాయా..? ప్రింటెడ్ చీరల తయారీ సిల్ సిటీ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందా..? ప్రభుత్వం చొరవ చూపకపోతే వేలాది మంది నేతన్నల జీవనోపాధిపై ప్రభావం పడుతుందా..? అంటే.. అవునని చెప్పక తప్పదు. జియో ట్యాగ్, పేటెంట్ కలిగిన పోచంపల్లి డిజైన్లకు దీటుగా నకిలీ ప్రింటెడ్ చీరలు జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా నేతన్నల జీవనోపాధి పై ప్రభావం చూపుతున్నది
– యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ)/ భూదాన్ పోచంపల్లి
పోచంపల్లి.. ఇక్కత్ పట్టు చీరకు పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తుంటారు. చీరలకు చేతులతో రంగులు వేసే సంప్రదాయ పద్ధతినే ఇక్కత్ అని పిలుస్తుంటారు. చీరకు ఎకడ రంగు వేయాలో ముందే ఊహించుకొని.. దారాలకు రంగులేసి, రకరకాల డిజైన్లను నేస్తారు. పోచంపల్లి బ్రాండ్ పేరుతో పేటెంట్ కలిగిన ఈ పట్టు చీరల తయారీలో వేలాది మంది నేతన్నలు భాగస్వాములై ఉన్నారు. ఇకడ ఇకత్ పట్టు చీర నాణ్యత, మన్నిక, డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా మగువల మనసు దోచుకుని, వారి ఆదరణను పొందాయి. అయితే ఇంతటి ఘన చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రస్తుతం ఇబ్బందులు పడింది. జియోగ్రాఫికల్ వెరిఫికేషన్ ట్యాగ్ కలిగిన కూడా ఇకత్ డిజైన్లను కూడా కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటింగ్ పాలిస్టర్ చీరలు తయారుచేసి బహిరంగ మారెట్లో విక్రయిస్తున్నారు. దీంతో పోచంపల్లి ఇకత్ మనుగడకు ప్రమాదం ఏర్పడింది.
పోచంపల్లి ఇక్కత్ నకిలీ చీరలు జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. కొంత మంది సాదా చీర నేసి.. దానిపై.. హైదరాబాద్ లో ప్రింట్ వేయిస్తున్నారు. ఇదే డిజైన్ మగ్గంపై నేస్తే రూ. 13వేలకు విక్రయిస్తారు. కానీ ప్రింటెడ్ చీరలు మాత్రం 10వేల లోపే అమ్ముతున్నారు. ఇక గత కొంత కాలంగా గుజరాత్ లోని సూరత్ కేంద్రంగా ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మారెట్ లో ముంచెత్తుతున్నాయి. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టుచీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అలాంటి పట్టుచీరలకు డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తకువ ధరకు బహిరంగ మారెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ఏది అసలు.. ఏది నకిలీనో గుర్తించలేకపోతున్నారు. పలు సందర్భాల్లో ఆన్ లైన్ లో మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడునేతల నేసే పేరుతో వస్తున్న ప్రింటడ్, పాలిస్టర్ చీరలు 600 నుంచి 1000 మధ్య అందుబాటులో ఉంటున్నాయి.
నకిలీ చీరలతో పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు చేనేత వృత్తిదారుల జీవనోపాధి దెబ్బతింటున్నది. జిల్లాలో సుమారు 11వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. నేతన్న నేసే పట్టు చీర డిజైన్ బట్టి గరిష్టంగా రూ. 20వేల దాకా పలుకుతుండగా, కాపీ చేసి ప్రింట్ చేసిన చీరలు బహిరంగ మారెట్ అతి తకువ ధరలకే లభ్యవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఉపాధి లభించని పరిస్థితి దాపురిస్తున్నది. అందరికీ పని దొరకని దుస్థితి నెలకొంది. గిరాకీ లేకపోవడంతో చేసిన పనికి కూలి డబ్బులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. దీంతో కార్మికుల జీవనం దుర్భరంగా మారుతున్నది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నా యి. పోచంపల్లికే పరిమితమైన చేనేత డిజై న్లు జియో ట్యాగ్, పేటెంట్ హకు ఉన్న ఇకత్ డిజైన్లు కాపీకి గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
ప్రింటెడ్ చీరలతో చేనేత పరిశ్రమకు నష్టం వాటిల్లుతున్నది. పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల డిజైన్లతో వచ్చిన పాలిస్టర్ చీరల కారణంగా పోచంపల్లి నేతన్నలు కష్టపడి మగ్గంపై నేసిన చీరలు క్రమక్రమంగా డిమాండ్ తగ్గుతున్నది. నేతన్నలు నేసే పట్టు చీరల అమ్మకాలు రోజురోజుకు పడిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో నేతన్నల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతున్నది. అసలే గిరాకీ లేక చేనేత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నేసిన చీరలు టెసో సరిగా కొనుగోలు చేయడం లేదు. దీంతో చేనేత నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి.
పోచంపల్లి పట్టు చీరలో అంచు బార్డర్ సాదా చీరలు తయారు చేయించి మధ్యన ప్రింటెడ్ డిజైన్లు వేస్తున్నారు . పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు నకిలీ చీరలు ప్రింట్ చేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి నకిలీ చీరలతో కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది . వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ నేత కార్మికులు ఇదే వృత్తిలో కొనసాగుతారు . పోచంపల్లి ఇకత్ డిజైన్లు నకిలీ చీరలు తయారీదారులు విక్రయిదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
-ఏలె భిక్షపతి , రాష్ట్ర చేనేత నాయకులు, భూదాన్ పోచంపల్లి
చేనేత పరిశ్రమ సంక్షోభంతో నేసిన వస్త్రాలు అమ్ముడుపోక కార్మికులకు పని కల్పించడం లేదు. పోచంపల్లి ఇకత్ డిజైన్లతో ప్రింటెడ్ వస్త్రాలతో గిరాకీ లేక నేసిన వస్త్రా నిల్వలు పేరుకపోతున్నాయి. పనులు లేక వలసలు వెళ్లే దుస్థితి నెలకొంటుంది. వేరే పని చేయలేక చేనేత పనిచేస్తూ అప్పుల భారంలో కూరుకుపోతున్నా. ప్రభుత్వం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి.
-దుద్యాల పాపయ్య, చేనేత కార్మికుడు భూదాన్ పోచంపల్లి
పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు ముప్పుగా ప్రింటెడ్ చీరలు డిజైన్లు కాపీ కొట్టడంతో ఫ్రంట్ చీరలు అతి తకువ ధరకే దొరుకుతున్నాయి. ఇక్కత్ పట్టు చీరలు పదివేల రూపాయలకు దొరుకుతుండగా 600 నుండి వెయ్యి రూపాయల వరకు ప్రింటెడ్ చీరలు లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపు మొగ్గు చూపుతారు. పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది . చేనేత వృత్తిదారులు పనిలేక నష్టపోతురు. పెద్దపెద్ద షాపింగ్ మాల్ లో ప్రింటెడ్ చీరలు అమ్ముతుర్రు. పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. ప్రింటెడ్ చీరలను నియంత్రించాలి . చేనేత ఇకత్ వృత్తిని పరిరక్షించాలి. కార్మికులందరికీ పని కల్పించాలి.
-చింతకింది రమేశ్, అధ్యక్షుడు రాష్ట్ర చేనేత జన సమాఖ్య, భూదాన్ పోచంపల్లి