నల్లగొండ, సెప్టెంబర్ 04 : వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో గాని, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో గాని బీజేపీ నాయకులు ఎవరూ పాల్గొనలేదన్నారు. ప్రజల చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ అందవేసిన చేయిగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించడాన్ని తప్పుపట్టారు. ఆ పోరాటమంతా దున్నేవాడికే భూమి, స్వేచ్ఛ కోసం పోరాటం అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను సెప్టెంబర్ 10 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని, వార్షికోత్సవ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ అయినా శ్రీశైలం సొరంగం మార్గం పనులను ప్రారంభించాలని, కాల పరిమితి నిర్ణయించి పూర్తి చేయాలన్నారు.
శాసనసభలో వెనకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ల చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపినా, గవర్నర్ వెంటనే సంతకం చేయాలని అఖిలపక్ష పార్టీలు కోరినా నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ దగ్గరికి పలు సవరణలు, చట్టాలు పంపినా సంతకాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లపై కూడా గతంలో మాదిరిగా కాకుండా వెంటనే సంతకం చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందని, నివేదించిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం కింద నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పట్టు విడిచి నిధులను కేటాయించాలన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఎన్డీఏ నేతలు ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, ప్రజాతంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని హితవు పలికారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత అత్యధికంగా ఉన్నదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతాంగానికి యూరియా కొరత లేకుండా బాధ్యత తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని వారు సూచించారు. అదేవిధంగా భారతదేశం మీద అమెరికా చేస్తున్న ఒత్తిడి ప్రమాదకరమని భారత దేశ సరుకుల మీద 50 శాతం సుంకాలు విధించడం అమెరికా ప్రభుత్వం చేస్తున్న బ్లాక్మెయిల్ అన్నారు. అమెరికా చేస్తున్న బ్లాక్ మెయిల్ పై ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని, నోరు మెదపకుండా ఉన్నారని వారు ప్రశ్నించారు. ఇండియా, చైనా, రష్యా దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఆహ్వానించదగ్గ పరిణామాలన్నారు. ఈ సంబంధాలు, సహకారం బలోపేతం అయితే అమెరికా మెడలు వంచవచ్చని అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని చెరువులను, కుంటలను నింపాలన్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు షాపుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్కటి, రెండు బస్తాలు కూడా దొరకడం లేదన్నారు. అధికారులు, మంత్రులు మాత్రం యూరియా కొరత లేదని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాల వల్ల జిల్లాలో అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు, చెక్ డ్యాములు దెబ్బతిన్నాయని, కొన్ని పంటలకూ నష్టం జరిగిందని, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపి, నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికారి మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.