నీలగిరి, మే 26 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో పనులు మంజూరై పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీకి వందల కోట్ల రుపాయల పనులు మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిన్నింటిని నిలిపి వేసిందన్నారు. ఫలితంగా ప్రజలు చాలా కాలనీల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పానగల్ రోడ్డులోని శ్రీరామ్ నగర్ కాలనీల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయని, వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. శ్రీనగర్ కాలనీ, దీపక్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, ఆదిత్య కాలనీలో ఏ చిన్న గాలి, వాన వచ్చినా పానగల్ విద్యుత్ ఫీడర్ శ్రీనగర్ కాలనీ విద్యుత్ ఫీడర్ కలిసి ఉండడం వల్ల అదనపు లోడ్‌తో ట్రిప్ అయి ప్రతిసారి కరెంట్ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. దీన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయన వెంట ఎం,కిషన్, ఎం.దశరథ, యాకాల వెంకన్న, నిమ్మనగోటి శ్రీను, జంపాల గిరి, కొండూరు గిరి, కవిత, కృష్ణవేణీ ఉన్నారు.