చివ్వెంల, జనవరి 21 : రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేండ్ల కోసారి జరుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ జాతర ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందు మధుమాసం, అమావాస్య ఆదివారం రాత్రి దిష్టికుంభాలు పోయడం, దిష్టి పూజ చేయడం ఆనవాయితీ. దిష్టిపూజ తర్వాత జాతర పనులను ప్రారంభిస్తారు.
దిష్టిపూజ కార్యక్రమాలు
ఆదివారం సాయంత్రం కేసారంలో మెంతబోయిన వారు, మునగొర్ల వారు, బైకాని వారు దేవర పెట్టెలోని దేవతామూర్తులైన లింగమంతుల స్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మల విగ్రహాలను శుభ్రపరిచి పసుపు కుంకుమలతో బొట్టు పెడతారు. బంతిపూల దండలతో అలంకరించి కులపెద్దలు ధూపదీపారాధన చేసి, కొబ్బరి కాయలు కొట్టి పరమాన్నం నైవేధ్యంగా పెట్టి దేవరపెట్టెను ఓ లింగా.. ఓ లింగా.. అంటూ కదిలిస్తారు. ఆదివారం రాత్రి కేసారంలో మెంతబోయిన వారి ఇంటి నుంచి ప్రారంభమైన అందెనపు సౌడమ్మ దేవరపెట్టె ఊరేగింపు అర్ధరాత్రికి దురాజ్‌పల్లి శివారులోని పాలసెర్లయ్య గుట్టపై గల లింగమంతుల స్వామి ఆలయానికి చేరుకుంటుంది. అందెనపు చౌడమ్మ దేవర పెట్టెను భుజాలపై మోసుకుంటూ ఓలింగా అంటూ నడుస్తూ ఊరేగింపుగా బయలు దేరుతారు. ఊరేగింపులో ముందు వరుసలో బైకాని వారు వీరణం, తాళాలు వాయిస్తూ జానపద గేయాలు పాడుతుంటారు. మరికొందరు గొల్లలు ఎర్రని చొక్కాలు, గజ్జెల లాగులు ధరించి కాళ్లకు రవ్వ గజ్జెలు కట్టుకుని నృత్యాలు చేస్తారు. వీరి వెనుక నలుగురు గొల్లలు దేవరపెట్టెను ఊరేగింపుగా తీసుకొని వెండగా గొల్లలతో పాటు,మిగిలిన కులాలవారు దేవరపెట్టె ముందు నీళ్లు ఆరపోస్తూ మంగళహారతులు ఇస్తూ ఊగుతారు.
అనంతరం దేవరపెట్టెను మర్రిచెట్టు దగ్గర ఉన్న మెట్ల మార్గం గుండా పాలసెర్లయ్య గుట్టపైకి తీసుకెళ్ల్లి గుట్టపైనున్న ఆలయం చుట్టూ మూడుసార్లు తిరిగి లింగమంతుల స్వామి, చౌడమ్మ ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో దేవరపెట్టెను పెడతారు. దేవర పెట్టె గట్టుపైకి చేరిన తర్వాత దిష్టికుంభాలు పోసి రెండు దిష్టికుంభాల నుంచి కొంత అన్నమును తీసి(పెరుగు ముద్ద) ముద్దగా చేసి గొర్లవారికి ప్రసాదంగా ఇస్తారు. ఈ ముద్దను వంశపారంపర్య హక్కుదారులు మాత్రమే పంచుకొని ప్రసాదంగా తింటారు. మిగిలిన దిష్ఠికుంభాల అన్నమును భక్తులకు ప్రసాదంగా పెడతారు. దీంతో దిష్ఠిపూజ ముగుస్తుంది.
ముమ్మరంగా జాతర ఏర్పాట్లు
పెద్దగట్టు జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఏం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో అధిక నిధులు కేటాయించారు. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న పెద్దగట్టు జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నది. శాశ్వత, తాత్కాలిక పనులతో పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో గుట్టచుట్టూ రోడ్లకు మహర్దశ వచ్చింది.
– కోడి సైదులు యాదవ్, పెద్దగట్టు ఆలయ చైర్మన్, దురాజ్‌పల్లి