యాదగిరిగుట్ట, జనవరి 7 : పంచ నారసింహ స్వామి దివ్య క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. క్యూలైన్లు, తిరు మాఢవీధులు, ప్రసాద విక్రయశాల సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ పెరిగింది. నిత్య తిరు కల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారిని సుమారు 36 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టు వస్ర్తాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలను పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు కొనసాగించారు. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారు జాము నుంచి మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్ర నామార్చన జరిపారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవ మూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు.
సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలు జరుగగా భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి పారాయణందారులు పాశురాలను పఠించారు. తిరుప్పావై వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఖజానాకు రూ.43,61283 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారి రామకృష్ణారావు తెలిపారు.
స్వామివారికి వెండిపూల బుట్ట బహూకరణ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి హైదరాబాద్కు చెందిన ఒమేగా ఆసుపత్రి ఎండీ టి. శ్రీకాంతారావు కేజీ వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన పూల బుట్టను విరాళంగా సమర్పించారు. ఆదివారం కొండపైకి చేరుకొని ఆలయ ఏఈఓ రఘుకు అందజేశారు.