Government Doctor | సూర్యాపేట, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఎవరికైనా ఏదైనా అవసర నిమిత్తం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నా.. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చినా.. మరేదైనా సంతకం కావాలన్నా నేరుగా సూర్యాపేట జనరల్ దవాఖానలోని ఓ డాక్టర్‌ను కలిస్తే సరిపోతుందనే ప్రచారం అక్కడ జరుగుతున్నది. ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్నా సరే ఫోన్ చేస్తే వచ్చి సంతకం పెట్టి ఐదొందలు తీసుకుంటాడట.! అంతే కాదు వందకు పైనే ఉన్న డాక్టర్లలో ఈ ఒక్కడి నిర్వాకం ఎలా ఉందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉంటూనే ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌కు అత్యవసర పని ఉండి బయటకు వెళ్తే ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే వాలిపోతాడట.! రెండు నుంచి మూడు గంటల విధులు నిర్వర్తించి అప్పటి వరకు వచ్చిన ఫీజులను అతనే తీసుకుని పెయిడ్ సర్వీసు ఇస్తున్నాడట.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించిన ఈ ఆస్పత్రి బ్రాండ్ రోజురోజుకు దిగజారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు వెలిగిన ప్రభుత్వ వైద్యం కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మసకబారుతున్నది. నాడు మెరుగైన వైద్యం, చికిత్సలు చేయడంలో అనేక రివార్డులు, అవార్డులు అందుకున్న చోట నేడు వైద్యాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ కరువు రాజ్యమేలుతున్నది. మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పట్టుబట్టి నాటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సూర్యాపేటకు మెడికల్ కళాశాలను తెప్పిస్తే అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఏరియా ఆసుపత్రి సకల హంగులతో జనరల్ దవాఖానగా రూపాంతరం చెందింది.
నాటి నుంచి సూర్యాపేట జిల్లాతోపాటు పరిసర జిల్లాల ప్రజలకు సాధారణ జ్వరం నుంచి మొదలుకుంటే ఉచితంగా మోకీళ్ల ఆపరేషన్ల లాంటి అనేక రకాల ఆపరేషన్లు, అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ వచ్చింది. ప్రసవాలు, ఓపీ వంటి వాటిలో రాష్ట్ర స్థాయిలో రికార్డులు అందుకుంది. కానీ గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలనలో సూర్యాపేట జనరల్ దవాఖానకు వెళ్తే అక్కడ దిగజారిపోతున్న వైద్య సేవలు, పర్యవేక్షణ కరువు ఎవరికి వారు యమునాతీరు అన్నట్లు మారిపోతుండడం బాధ కల్గిస్తుందని పలువురు వాపోతున్నారు.
సరిపడా మందులు లేవు, టెస్టులు కరువు, డాక్టర్లు అందుబాటులో ఉండరు..మొత్తం మీద ఈ దవాఖానను పట్టించుకునే నాధుడే కరువవడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ విద్యార్థులే దాదాపు 90 శాతం చికిత్సలు అందిస్తుండగా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్రమాలకు అడ్డాగా ఈ ఆస్పత్రి మారి ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం వెయిటేజీ మార్కులు కలుపుకొనేందుకు డబ్బులు తీసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ దవాఖానలో ఒక సాధారణ వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తినా గుర్తించలేని దుస్థితి నెలకొనగా మరో ప్రైవేట్ వ్యక్తి గుర్తించగా మందలించి వదిలేశారు.
ఇదిలా ఉంటే ఈ ఆసుపత్రిలో ఓ ఐదొందల డాక్టర్ ఉన్నాడని, అతను ఆ డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడని ప్రచారం సాగుతున్నది. ఎవరికైనా గెజిటెడ్ సంతకం లేదా డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటే సదరు డాక్టర్‌కు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి ఐదొందలు తీసుకొని సంతకాలు చేసి ముద్ర వేస్తాడట. అంతేకాదు పట్టణంలోని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు మూడు గంటల ఇతర పని ఉన్న డాక్టర్లు ఈ ఐదొందల డాక్టర్‌కు ఫోన్ చేసి డ్యూటీ చేయించి డబ్బులు ఇస్తారని చెబుతున్నారు. దాంతో ఒకప్పుడు వెలుగులు వెలిగిన జనరల్ ఆసుపత్రి ఏ స్థాయికి దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఎవరో ఒకరు స్పందించి ఈ దవాఖానను చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.
సూర్యాపేట జనరల్ దవాఖానలో ఇప్పటికే మందుల కొరత వేధిస్తుండగా డాక్టర్లు చుట్టపుచూపుగా వచ్చిపోతుండడం, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దవాఖాన నిర్వహణ ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది తెలుస్తున్నది. కాగా ఇటీవల ఓ వ్యక్తి కాలుకు గాయమైతే కట్టు కట్టేందుకు మెటీరియల్ అందుబాటులో లేకనో మరేదైనా కారణమో తెలియదు కానీ అట్ట ముక్కతో కట్టుకట్టి వైద్యానికే మచ్చతెచ్చాడు. తాజాగా ఓ వ్యక్తి మూడు రోజుల పాటు డాక్టర్ అవతారమెత్తి రోగుల బెడ్స్ వద్దకు వెళ్లి సిబ్బందిని పిలిచి ఏమి మందు లు ఇస్తున్నారు అంటూ తనకు తెలిసిన మందుల పేర్లు చెబుతూ వాటిని ఇవ్వాలని చెప్పగా సిబ్బంది ఆ వ్యక్తి మాటలు ఫాలో అవుతూ మందులు ఇచ్చినట్లు తెలిసింది.
మూడు రోజుల పాటు డాక్టర్‌గా చలామణి అయినట్లు తెలుస్తుండగా పేషెంట్ల కేస్ షీట్లో డాక్టర్ పేరు ఉంటుండగా అక్కడకు వచ్చిన డాక్టర్ ఎవరు అనేది గుర్తించకపోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఇంత జరుగుతున్నా అతను డాక్టర్ కాదని ఎవరూ గుర్తించకపోగా, ఓ రోగి వెంట వచ్చిన అటెండర్ గుర్తించి ప్రశ్నిస్తే వెలుగులోకి వచ్చింది. వెంటనే ఓ డాక్టర్, ఇతర సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకొని మాట్లాడి ఆరా తీసి హెచ్చరించి పంపించినట్లు తెలిసింది. డాక్టర్‌గా చలామణి అవుతూ ఆయన చెప్పిన మందులు వాడినా ఎవరికీ ఇబ్బంది కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని, కానీ ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే గందరగోళంగా మారేదని ఓ వైద్యాధికారి ఆస్పత్రి నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశాడు.