మాడుగులపల్లి, ఆగస్టు 22 : మాడుగులపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, స్థానిక నాయకులు మాట్లాడుతూ.. మండల పరిధిలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని, నకిలీ ఎరువులు అమ్మినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతేకాకుండా ఈ కేంద్రం ద్వారా రైతులకు పంటల సాగు విధానంపై, సరైన మోతాదులో ఎరువుల వినియోగంపై తగిన సలహాలు అందించాలని సూచించారు. మండల కేంద్రంలోనే ఈ షాపు అందుబాటులోకి రావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేశ్, సర్పంచ్ అరూరి నరేశ్, ఉప సర్పంచ్ మల్లేపల్లి వెంకన్న, సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఏఓ శివకుమార్, మన గ్రోమోర్ సిబ్బంది మురళి, కృష్ణంరాజు, జోనల్ హెడ్ రాజేశ్, జోనల్ మార్కెటింగ్ మేనేజర్ శేషు, నల్లగొండ ఏరియా మేనేజర్ అశోక్, మాడుగులపల్లి మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్ నాగార్జున, పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.