– కలెక్టర్, డీఏఓకు పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 27 : యూరియా ఆన్లైన్ విధానం ఎత్తివేయాలని, ఎరువుల బస్తాలకు ఇతర ప్రోడక్ట్ లింక్ చేయొద్దని ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఫర్టిలైజర్ షాపుల బంద్ సోమవారం విజయవంతం అయింది. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానం నుండి పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్ మీదుగా ర్యాలీగా వెళ్లి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిని అందజేసి మాట్లాడారు. రైతులు, డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ చర్యలు కంపెనీలకు కొమ్ముకాసేలా ఉంటున్నాయన్నారు. ఎరువుల స్టాక్ పాయింట్ నుండి దుకాణానికి సరఫరా అయ్యే రవాణా ఖర్చులు భరించాలని, బడా కంపెనీల పెత్తనం తగ్గించాలని కోరారు.
లింకు ప్రోడక్ట్ బలవంతంగా అంటగట్టడాన్ని నిలిపివేయాలన్నారు. రాష్ట్రవ్యాప్త ఎరువుల దుకాణాల బంద్ కార్యక్రమంలో భాగంగా పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమానికి తిప్పర్తి, కనగల్, మునుగోడు, గుర్రంపోడు, మాడుగులపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున డీలర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఫర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి మధు, కోశాధికారి సుంకరి నాగరాజుగౌడ్, పగిడి విగ్నేష్, యాదగిరి రెడ్డి, ఉపేందర్, మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, శ్రీను, వెంకన్న, చంద్రమౌళి, నాగభూషణ్ పాల్గొన్నారు.

‘యూరియా ఆన్లైన్ విధానం ఎత్తేయాలి’