గుండాల, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ గుండాల మండలం అంబాల గ్రామ రైతుల ఆగ్రహా జ్వాలలను అధికారులు చవి చూడాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గుండాల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యానికి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో పోసి రెండు నెలలవుతున్నా కనీసం రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని అన్నారు. వారానికి కనీసం ఒక్క లారీ కూడా తమ గ్రామానికి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రంలో ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయని, ధాన్యాన్ని కొనుగోలు చేసేవారే లేరని వాపోయారు. వర్షాకాలం వచ్చిందని, వాన కాలం పంట కొరకు రైతులు ఎప్పుడు సిద్ధం కావాలని ప్రశ్నించారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందంటూ మహిళా రైతులు శాపనార్థాలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ గుండాలకు రావాలని డిమాండ్ చేశారు. తాము నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక తాసీల్దార్ హరికృష్ణ సమాధానం చెప్పకుండా పట్టనట్లు వ్యవహరించడంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనై తాసీల్దార్ చాంబర్లోకి దూసుకెళ్లారు.
తమ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని తాసీల్దార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులు.. మీ కండ్లకు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నినాదాలతో తాసీల్దార్ కార్యాలయంలో గందరగోళం నెలకొన్నది. దీంతో తాసీల్దార్ పోలీసులను పిలిపించారు. ఎస్సై శోభన్‌బాబు సిబ్బందితో వచ్చి రైతులకు సర్దిచెప్పే యత్నం చేసినప్పటికీ రైతులు శాంతించ లేదు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాసీల్దార్ హరికృష్ణ, ఎస్సై శోభన్‌బాబు కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాసీల్దార్ వెంటనే ఏపీఎంను పిలిపించగా… ఏపీఎం మాట్లాడుతూ అంబాల గ్రామానికి రోజు రెండు లారీల చొప్పున పంపిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీసు ప్రశాంత్, మాజీ సర్పంచ్ లగ్గాల భిక్షమయ్య, రైతులు జక్కుల యాదయ్య, బద్ధం చెన్నారెడ్డి, నర్రంల నర్సయ్య, నర్రంల అంజమ్మ, దుర్గం అలివేల, బద్ధం రమ, బద్ధం సునీత, కొప్పుల భాగ్యమ్మ, రాంపల్లి భద్రమ్మ, మారోజు పరమేశ్, మజ్జిగ సాయి, రాంపల్లి బుచ్చయ్య, రాంపల్లి బాషా, బద్ధం రాంరెడ్డి, బద్ధం దశరథరెడ్డి, బద్ధం బాషిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సత్తిరెడ్డి, నర్రంల మధు, అంబాల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.