రామగిరి, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ, శైవాలయాల్లో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రధానమై శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. ‘ఓం నమశివాయ నమః’ పంచాక్షరీ జపంతో భక్తులు పులకించారు. మరో వైపు తెల్లవారు జామునే సమీపంలోని నదులు, చెర్వులు, కుంటలు, కాల్వల్లో స్నానాలు చేశారు. నల్లగొండలోని ఉదయ సముద్రంలో భక్తులు నదీస్నానం చేశారు. రాత్రి కార్తీక దీపాలు వెలిగించడంతో దీపకాంతులతో ఆలయాలు వెలిగిపోయాయి. కొన్ని ఆలయాల్లో సాముహిక వ్రతాలు చేయ గా, మొక్కులున్న మహిళలు, యువతులు నిష్టతో దీపాలు వెలిగించారు.
పలు దేవాయల్లో జ్వాలా తోరణం నిర్వహించారు. నల్లగొండలోని బ్రహ్మంగారి గుట్టపై ఉన్న శివాలయంలో, రామగిరి సీతారామచంద్రస్వామి సన్నిధిలో దీపాలు వెలిగించారు. పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వరాలయంతోపాటు, తులసీనగర్, పాతబస్తీ శ్రీసంతోషిమాత దేవాలయంలో, కామేశ్వర్రావు కాలనీలోని శివాలయంలో, వాడపల్లి, చెర్వుగట్టు, పిల్లల మర్రిలోని శివాలయల్లో భక్తులు పెద్దసంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. సాముహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించ గా.. రాత్రి అంతటా కార్తీక దీపాలు వెలిగించడంతో దీపకాంతులతో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నల్లగొండలో..
పానగల్‌లోని శ్రీఛాయ సోమేశ్వరాలయంతోపాటు పచ్చల సోమేశ్వరాలయాల్లో తెల్లవారు జామునుంచే భక్తులు అభిషేకాలు చేయించేందుకు తరలివచ్చి, ఆల యం ఎదుట ఉన్న కోనేరులో దీపాలు వెలిగించారు. పానగల్‌లోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు చేశారు. తులసీనగర్ భక్తాంజనేయస్వామి సన్నిధిలోని కాశీవిశ్వేశ్వరస్వా మి దేవస్థానం, సత్యనారాయణ స్వామి దేవాలయాల్లో పూజలు చేశారు. వీటీ కాలనీలోని శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వస్వామి దేవస్థానం, పాతబస్తీలోని సంతోషి మాత తదితర ఆలయా ల్లో పూజలు చేశారు.