ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవియేషన్ వింగ్ కమాండర్ ఏడీ రాయ్ బృందం, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డితో కలిసి సోమవారం యాదాద్రిని సందర్శించి హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా యాదాద్రి కొండ కింద యాగశాల నిర్వహణకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో మూడు ప్రత్యేకమైన హెలిప్యాడ్లను నిర్మిస్తున్నారు. ఒకేసారి మూడు హెలికాప్టర్లు ల్యాండ్ కానున్న నేపథ్యంలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను క్షేతస్థాయిలో పరిశీలన చేశారు. రెండు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఏవియేషన్ కమాండర్ పలు సూచనలు చేశాడని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టి రాష్ట్రపతి వచ్చే సమయానికి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ శంకరయ్య, వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ సైదయ్య పాల్గొన్నారు.