యాదగిరిగుట్ట, జనవరి 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభువులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. ప్రధానాలయంలో సాయం త్రం వేళలో స్వామి వారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.18,57,647 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి దర్శనానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి రానున్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా స్వామి దర్శనానికి వస్తున్నారు. శనివారం సాయంత్రం 4గంటలకు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అర్చకులు సీఎస్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.