NEET | రామగిరి/సూర్యాపేట, మే 2 : వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2025 ఈ నెల 4న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 సెంటర్లు ఏర్పాటు చేయగా 2,087, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయగా 890 మంది పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు. పరీక్ష హాల్లోకి ఎంట్రీ కాగానే విద్యార్థి బయోమెట్రిక్ తీసుకుంటారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు పెన్ను అందజేస్తారు. వాటితోనే పరీక్ష రాయాలి. ఈ సందర్భంగా నల్లగొండ, సూర్యాపేట కలెక్టర్లు మీడియా సమావేశంలో శుక్రవారం నీట్ ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు.
విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని తెలిపారు. పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పర్సులు, కలర్‌ఫుల్ దుస్తులు, బంగారు అభరణాలు అనుమతించరని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ ఉండాలని, సెంటర్లలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓఆర్ఆర్ ప్యాకెట్స్, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సందేహాలుంటే టోల్ ప్రీ నంబర్ 1800 425 1442లో సంప్రదించాలని తెలిపారు. నల్లగొండలో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, నీట్ నోడల్ అధికారి, కేవీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల(ఎంజీ యూనివర్సిటీ), యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎంజీ యూనివర్సిటీ), యూనివర్సిటీ సైన్స్ కళాశాల (ఎంజీ యూనివర్సిటీ), యూనివర్సిటీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎంజీ యూనివర్సిటీ), నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రామగిరి నల్లగొండ, కేంద్రీయ విద్యాలయం, మిర్యాలగూడ రోడ్డు, నల్లగొండ.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట, టీజీఎస్డబ్ల్యూర్ స్కూల్ అండ్ కాలేజ్ (బాలికలు) ఇమాంపేట, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ దురాజ్‌పల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేటలో పరీక్షలు నిర్వహించనున్నారు.