సూర్యాపేట, ఆగస్టు 3 : అన్యాక్రాంతం అవుతున్న సాగునీటి పారుదల శాఖ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. కాల్వ కట్టలకు ఇరువైపులా అందమైన పార్కులను తలపించే పల్లె ప్రకృతి, మెగా పల్లె ప్రకృతి వనాలను తయారు చేయనుంది. దీని ద్వారా పర్యావరణం పరిరక్షించడమే కాకుండా సమీప గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందనుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్
ఎడమ కాల్వ, మూసీ కాల్వల భూముల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెండు నుంచి మూడు వరుసల్లో..
జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కాల్వ 50 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ 55 కిలోమీటర్ల మేర ఉంది. ఈ రెండు కాల్వలకు ఇరువైపులా దాదాపు 50 నుంచి 90 మీటర్ల పరిధిలో కాల్వ నిర్మాణ సమయంలో రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూముల్లో కంప చెట్లు పెద్ద ఎత్తున మొలిచాయి. మరికొన్ని చోట్ల రైతులు సేద్యం చేసుకుంటున్నారు. వాటిని గుర్తించి సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 80 శాతం వీటి గుర్తింపు పూర్తయ్యింది. ప్రజల అవసరాలు, వాహనాల రాకపోకలకు దారి ఉంచి మిగిలిన స్థలంలో పల్లె ప్రకృతి, మెగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నారు. 50 మీటర్లు ఉన్న చోట పల్లె ప్రకృతి వనం, 90 మీటర్లు ఉన్న చోట మెగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు కాల్వల వెంట 800 ఎకరాలను గుర్తించిన అధికారులు 350 పల్లె ప్రకృతి వనాలు, 130 మెగా పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 40 చోట్ల పల్లె ప్రకృతి వనం పనులు ప్రారంభించి లక్షకు పైగా మొక్కలు నాటారు. సూర్యాపేట జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఇరిగేషన్ కాల్వల వెంట మొక్కలు నాటనున్నారు. మూసీ కాల్వల వెంట మాత్రం రెండు నుంచి మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. రెండేండ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి అనంతరం పిల్ల కాల్వల వెంట మొక్కలు నాటే ప్రణాళికను సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మున్సిపాలిటీలకు బాధ్యత..
ఇరిగేషన్ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపాలిటీలకు అప్పగించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి మూసీ కాల్వల వెంట మొక్కలు నాటే బాధ్యతను ఇచ్చారు. హుజూర్నగర్ మున్సిపాలిటీకి దాని పరిధిలోని ఎన్ఎస్పీ కాల్వలను అప్పగించారు. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే వనాలను ఆయా గ్రామ పంచాయతీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. మొక్కలను సైతం ఆ గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని నాటుతున్నారు.
20 లక్షల మొక్కలు లక్ష్యం..
350 పల్లె ప్రకృతి వనాలు, 130 మెగా పల్లె ప్రకృతి వనాలతోపాటు కాల్వల వెంట రెండు వరుసల్లో నాటేందుకు సుమారు 20 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 30 రకాల మొక్కలు ఉండనున్నాయి. భారీ వృక్షాలుగా మారే మొక్కల నుంచి పూలు, పండ్లు తదితర మొక్కలు ఉండేలా చూస్తున్నారు.
అన్యాక్రాంతమైన భూముల్లో సర్వే..
సూర్యాపేట జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఇరిగేషన్ భూములు ఉన్నాయి. ఇరిగేషన్ కాల్వల వెంట భూములు పలుచోట్ల ఆక్రమణకు గురికావడంతో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అడ్డంకిగా మారుతున్నది. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో సర్వే నిర్వహించి సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో జిల్లాలో ఇరిగేషన్ భూములు సురక్షితంగా ఉండనున్నాయి.
అందమైన పార్కులను తయారు చేస్తాం
ఇరిగేషన్ భూముల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. 20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగానిర్ణయించాం. పల్లె ప్రకృతి వనాలు, మెగా ప్రకృతి వనాలు పూర్తయితే ఆహ్లాదకరమైన వాతావరణం తయారవుతుంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు సైతం పరిరక్షింపబడుతాయి.
– హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, సూర్యాపేట జిల్లా