నార్కట్పల్లి, జూన్ 28: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామ సోమేశ్వర, శివ జ్ఞానపీఠం వద్ద జాతీయ శైవాగమ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు సదస్సు కొనసాగనుంది.
సదస్సులో ప్రధాన దేవాలయాల ప్రధానార్చకుల అనుభవాలు వెల్లడించారు. దక్షిణాది రాష్ర్టాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 150 మంది పండితులు హాజరయ్యారు. శైవాగమ సంప్రదాయ అర్చకులందరికీ ఒక దివ్య సందేశాత్మకంగా, శైవాగమ దివ్య వైభవం దశదిశలుగా వ్యాపించే విధంగా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చెర్వుగట్టు ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తెలిపారు.