పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 17 : జిల్లా ఆశలసౌధం, జంటనగరాల వరప్రదాయిని ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) లింక్ కెనాల్ ప్రమాదపు అంచుల్లోకి చేరింది. లక్షా యాభైవేల ఎకరాలకు సాగునీరు, జిల్లా లోని 500 గ్రామాలు, జంటనగరాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. గత పాలకులు నిర్మించిన ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల లోపే ఒక్కొటొక్కటిగా నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. దాంతో ఏఎమ్మార్పీ ప్రాజెక్టును పటిష్ట పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ పక్కగా పనులు చేపడుతున్నది. ఇప్పటీకే లీకేజీలకు గురైన సిస్టర్న్, ఏకేబీఆర్‌కు మరమ్మతులు చేయడంతోపాటు ఇటీవల గేట్లకు కూడా మరమ్మతులు చేపట్టింది.
తాజాగా పుట్టంగండి సిస్టర్న్ నుంచి అక్కంపిల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు బలహీనంగా ఉన్న బ్యాకింగ్ రీచ్ వద్ద రూ. 4 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు.
14 కిలోమీటర్ల మేర లింక్ కెనాల్
ఏఎమ్మార్పీ పుట్టంగండి సిస్టర్న్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు 14 కిలోమీటర్ల మేర లింక్ కెనాల్(అనుసంధాన కాల్వ) ఏర్పాటు చేశారు. 4 వేల క్యూసెక్కుల నీరు ఒక్కసారి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన కాల్వ పడమటితండా, వద్దిపట్ల బ్యాంకింగ్ రీచ్‌ల వద్ద కోతకు గురై బలహీనంగా మారింది. దాంతో కాల్వ గండి పడితే నీటి సరఫరా నిలిచేపోతుందనే గ్రహించిన అధికారులు ప్రమాదకరంగా మారిన కాల్వ కట్ట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మా ణం చేపట్టారు. కాల్వ 0.50 కి.మీ నుంచి 2 కి.మీ మేరకు మూడు చోట్ల 600 మీటర్ల పొడవునా 5 మీటర్ల ఎత్తులో బ్యాంకింగ్ రీచ్‌కు కాల్వ లోపలి భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. దాంతో కోతకు గురైన కాల్వ మట్టికట్టపై భారం పడకుండా కాంక్రీట్ గోడతో ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ విషయాన్ని ఇటీవల ఇరిగేషన్ అధికారులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రూ. 4 కోట్లు మంజూరు చేయడంతో పనులను వేగంగా చేపడుతున్నారు.
నీటిని నిలిపి వేసి పనులు
అయితే ఈ వాల్ పనులు చేపట్టాలంటే కాల్వ నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తున్నది. గత రబీ సీజన్లో సగం పనులు చేపట్టి తిరిగి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఇటీవల ఆయకట్టుకు నీటిని సరఫరా ముగియడంతో జంటనగరాల తాగునీటి కోసం ఏకేబీఆర్‌లో నింపుకుని కాల్వకు నీటిని నిలిపి వేశారు. డిసెంబర్ 1 నుంచి పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. మరో వారంలో యాసంగికి నీటి విడుదల సమయం వస్తుండటంతో గడువులోగా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మూడు కాంక్రీంట్ మిక్సింగ్ యంత్రాలతో పనులు చేపడుతున్నారు. దాంతో భవిష్యత్‌లో పక్కాగా ఏఎమ్మార్పీ లింక్ కెనాల్ ఉండేలా, కట్టకు ప్రమాదం జరుగకుండా అధికారులు జాగ్రత వహిస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో పలు చోట్ల నీటి ఉధృతికి గండ్లు పడుతుండటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
జంటనగరాలకు వారానికి సరిపడా తాగునీటి నిల్వలు
లింక్ కెనాల్ మరమ్మతుల కారణంగా ఏఎమ్మార్పీ మోటర్లను అధికారులు నిలిపివేశారు. సిస్టర్న్ నుంచి ఏకేబీఆర్‌కు ఈ నెల 1 నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జంటనగరాలకు తాగునీటికి అంతరాయ ఏర్పడకుండా అధికారులు ముందస్తుగా ఏకేబీఆర్ను 246 ఎఫ్ఆర్ఎల్కు నిల్వ చేశారు. దాంతో ప్రస్తుతం 240 ఎఫ్ఆర్ఎల్కు నీటి మట్టం తగ్గింది. మరో వారం రోజులకు సరిపడా నీరు ఉండడంతో అధికారులు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నారు. ఈ నెల 25 వరకు పనులు పూర్తి చేసి ఏఎమ్మార్పీ మోటర్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారంలోగా పనులు పూర్తి చేస్తాం :జేఈ శ్రావణ్
ప్రస్తుతం లింక్ కెనాల్ ప్రమాదకరంగా ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించి 600 మీటర్ల పొడవునా 5 మీటర్ల ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మిస్తు న్నాము. గత సీజజ్లో 50 శాతం పూర్తికాగా ప్రస్తుతం ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయడంతో పదిహేను రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో పూర్తి చేసి యాసంగికి నీటిని విడుదల చేస్తాం. ప్రస్తుతం ఏకేబీఆర్ నిల్వ ఉన్న నీటినితో జంటనగరాలకు తాగునీరందిస్తాం.