మేళ్లచెర్వు, నవంబర్ 24 : మండలంలోని కందిబండ గ్రామంలోని భూనీళా సహిత చెన్నకేశవ స్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. సుమారు 400ఏండ్ల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని కూల్చివేసి దాతల సహకారంతో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. చెన్నకేశవ స్వామికి ప్రతియేటా మాఘ మాసంలో కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహోత్సవాల సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామస్తులంతా పండుగలా వేడుకల్లో పాల్గొంటారు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని కూల్చివేసి తిరిగి నిర్మించాలని ఇటీవల గ్రామస్తులు నిర్ణయించారు. కుల మతాలకు అతీతంగా చెన్నకేశవ డెవలప్మెంట్ సొసైటీగా ఏర్పడి చందాలు సేకరిస్తున్నారు. ఇప్పటికి సుమారు రూ.2కోట్లు చందాలు రాగా.. వాటితో పనులు ప్రారంభించారు. ఇప్పటికే బేస్మెంట్ పనులు పూర్తవగా.. ప్రస్తుతం రాడ్ బెండింగ్ పనులు నడుస్తున్నాయి. పనులు పూర్తయితే ఆలయం నూతన శోభను సంతరించుకోనుంది.
ఆలయ నిర్మాణానికి విరాళం
మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన గాయం నారపరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు శ్రీనివాస్‌రెడ్డి, వీరబాబురెడ్డి, రవీంద్రారెడ్డి చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి గతంలో రూ.5లక్షల చందా ప్రకటించారు. వీటిలో తొలి విడుతగా రూ.3లక్షల చెక్కును వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి ద్వారా నిర్వాహకులకు గురువారం అందించారు. కార్యక్రమంలో నాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.