యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటమి గుబులు పట్టుకున్నది. కాషాయ పార్టీ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో దిగులు పట్టుకున్నది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర తెరపైకి రావడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రచారం ముగిసేందుకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నా ఊర్లల్లో ప్రచార ఆర్భాటం కనిపించడంలేదు. ఒకరిద్దరు కీలక నేతలు తప్ప ఎవరూ రావడంలేదు. ఇప్పటికే కేంద్ర నాయకత్వం చేతులెత్తేసింది. దాంతో కాషాయ శ్రేణులు ఢీలా పడ్డాయి. టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని కొంత మంది కమలం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మునుగోడు జనమంతా టీఆర్ఎస్పై వెంటే నడుస్తున్నాయి. బంగారిగడ్డ బహిరంగ సభ తర్వాత వార్ వన్‌సైడ్ అయ్యింది. తటస్థ ఓటర్లు సైతం కారుకే జైకొడుతున్నారు.
ఎమ్మెల్యేల ఆడియోతో సీన్ రివర్స్
వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో మూడు నెలల క్రితం వరకు కూడా బీజేపీ ఎక్కడా లేదు. అనేక గ్రామాల్లో కమిటీలు వేయడానికి కూడా కార్యకర్తలు లేరు. అయితే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి.. అడ్డగోలుగా డబ్బులు ఆశజూపి.. సంతల్లో పశువుల్లా ఇతర పార్టీల నుంచి లీడర్లను కొన్నారు. డబ్బులిచ్చి ప్రచారం చేయించారు. మునుగోడును మనీగోడుగా మార్చారు. హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల ఎర అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా ఆడియో క్లిప్‌లు కూడా బయటకు వచ్చాయి. దాంతో మునుగోడులో ఒక్కసారి సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ లీడర్ల కౌంటర్లను కూడా జనం పట్టించుకోలేదు. పైగా కాషాయ పార్టీని తిట్టిపోశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సిగ్గు లేకుండా తడి బట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేయడం ఏంటని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజా లు తడుముకున్నట్లుందని ఏకిపారేస్తున్నారు.
తగ్గిన ప్రచార ఆర్భాటం..
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ జోరుగా డబ్బులు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నది. ఒక్కో ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల కోసం బూత్‌కు రోజుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నది. తిండి, తాగుడు, రోజువారీ కూలికి డబ్బులు కుమ్మరిస్తున్నది. అయితే ప్రచారం ముగింపునకు ఒక్క రోజే మిగిలి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీ ప్రచారం ఆగిపోయింది. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలో తప్ప ఎక్కడా జెండాలు, జనాలు కనిపించడంలేదు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా జనం అడ్డుకొని నిలదీస్తున్నారు. పైగా ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర ఆడియో బయటకు రావడంతో ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. జనం నుంచి ఛీత్కారాలు, ఈసడింపులు తప్పవని ముందుగానే పసిగట్టి ప్రచారానికి రాంరాం చెబుతున్నారు. దాంతో రెండు రోజులు సైలెంట్‌గా ఉండడమే బెటరనే భావనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
కారు వైపునకు తటస్థ ఓటర్లు
నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభతో మునుగోడు ఉప ఎన్నికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బహిరంగ సభకు ఊహించినదానికంటే ఎక్కువగా జనం స్వచ్ఛందంగా తరలిరావడం, సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆలోచింపజేసింది. అసలు ఓటు విలువ ఏంటి..? దాని శక్తి ఎలా పనిచేస్తుంది..? బీజేపీకి ఎందుకు వేయొద్ద్దు..? టీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలి..? బీఆర్ఎస్ ప్రవేశం అవసరం..? రాజగోపాల్‌రెడ్డి దుర్బుద్ధిని విపులంగా వివరించారు. ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. దాంతో ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లంతా సీఎం కేసీఆర్ పిలుపునకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే గ్రామాల్లో ఇన్చార్జీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్కే జై ..
ఇప్పటికే మునుగోడు జనమంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు.. తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు.. టీఆర్ఎస్ పథకం చేరని ఇల్లులేదు. ప్రతి ఇంట్లో రెండు, మూడు పథకాలతో లబ్ధి పొందుతున్నారు. దాంతో లబ్ధిదారులంతా టీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించుకుంటామని మద్దతు తెలుపుతున్నారు. రాష్ర్టానికి అన్యాయం చేయడమేకాకుండా ప్రజలపై భారం మోపుతున్న బీజేపీకి గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
ముఖం చాటేసిన ఢిల్లీ పెద్దలు..
ఓవరాల్‌గా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కేంద్ర నాయకత్వమే కనిపించలేదు. మునుగోడు అంటేనే ముఖం చాటేసింది. లోకల్ చోటామోటా లీడర్లు తప్ప ఢిల్లీ నేతలు ఎవరూ రాలేదు. చిన్నపాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం కేంద్ర మంత్రులను మోహరించింది. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఇన్‌డైరెక్ట్‌గా ప్రధాని మోదీని కూడా దింపింది. అలాంటిది మునుగోడుకు మాత్రం ఒక్కరూ పత్తాలేరు. ఓడిపోయే చోటకు వెళ్లి భంగపడటం దేనికనే ఆలోచనలో ఢిల్లీ నాయకత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరికి ఒక్కగానొక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ కూడా రద్దయ్యింది. దాంతో దింపుడు కల్లెం ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఇట్ల ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో కాషాయ శ్రేణులు నిరాశ చెందుతున్నాయి. ఎవరి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో డీలా పడ్డాయి.