చిట్యాల, అక్టోబర్ 31: బీజేపీ ఆడిన ఆటలో రాజగోపాల్‌రెడ్డి పావుగా మారి అనైతికంగా మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల తెలంగాణ భవిష్యత్‌ను మార్చే ఎన్నికని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ స్వప్రయోజనాల కోసం అనైతికంగా తీసుకొచ్చిన ఈ ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ బలపడొద్దనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ఇచ్చిందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామాతోటే మునుగోడు అభివృద్ధి చెందుతుందని చెప్పడం అబద్ధ్దమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే రాజ్యాంగబద్ధంగా పోరాడి యంత్రాంగాన్ని కదిలించాలే తప్పా ఇలా రాజీనామా చేయడం అనైతికమని విమర్శించారు.
కేంద్రలోని మోదీ సర్కారు సోనియాగాంధీ కుటుంబంపై కేసులు పెడుతూ, ఈడీ దాడులు జరుపుతూ ఆ కుటుంబాన్ని భయభాంత్రులకు గురిచేస్తున్న సమయంలో.. సోనియా అమ్మ లాంటిదని చెప్పే రాజగోపాల్‌రెడ్డి ఆమెకు అండగా ఉండకుండా బీజేపీలో చేరి ఉప ఎన్నిక తీసుకొచ్చారని ఆరోపించారు. దేశంలో తొమ్మిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చిన కేంద్రంలోని బీజేపీ తెలంగాణలో కూడా అలాంటి కుట్ర జరుపుతున్నదని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థ్ధించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేశ్, నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నారబోయిన శ్రీనివాస్, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు పాల్గొన్నారు.