రాజాపేట, అక్టోబర్ 30 : దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎన్నో కార్యక్రమాల అమలుతో ముందడుగు వేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పల్లెల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో పల్లెలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. రాజాపేట మండలంలోని జాలలో వాడ వాడల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంతో గ్రామ రూపు రేఖలే మారిపోయాయి.
జాల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇటీవలే ఎస్డీఎఫ్, ఈజీఎస్ నిధుల నుంచి రూ.45 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను వినియోగిస్తూ సర్పంచ్ గుంటి మధుసూదన్‌రెడ్డి గ్రామ వీధులను సీసీ రోడ్లుగా మార్చారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తితో వీధులన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం పంచాయతీ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వాములను చేశాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. మున్ముందు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించేలా కృషి చేసిన ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు.
– గుంటి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్, జాల గ్రామం
వానకాలం వస్తే గ్రామ వీధులన్నీ బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. గ్రామ పంచాయతీ పాలకులు గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వీధుల్లో సీసీ రోడ్లు వేయడంతో పాటు పారిశుధ్య పనుల నిర్వహణ సక్రమంగా జరుగుతుండడంతో ఇబ్బందులు తొలగిపోయాయి.
-కేశపురం ప్రేమలత, జాల గ్రామస్తురాలు