ఆదరణలేక అవసాన దశకు చేరిన వృత్తులు తిరిగి జీవం పోసుకున్నాయి. కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ గాడిన పడ్డది. బతుకే భారమనుకొన్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి వృత్తిదారులు చేరుకున్నారు. నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఫ్రీ కరంటు వచ్చింది. రజకులకు ధోబీఘాట్లు, బట్టలుతికే మిషన్లు వచ్చినయ్. కుమ్మరులకు ఆధునిక పాటరీ యంత్రాలు దొరికినయ్.. సబ్సిడీ వచ్చింది. ఇలా ఏ కులవృత్తి, ఏ కళాకారుడూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. ఫలితంగా వారికి ఏడాదంతా పని లభిస్తున్నది. కడుపునిండా తిండి దొరుకుతున్నది. ఇవే కాకుండా 40 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలూ వచ్చాయ్.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఆదెరువు లభించింది. అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ సర్కారు పూర్వ వైభవం తీసుకొచ్చింది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రజక, నాయీ బ్రాహ్మణులకు స్వరాష్ట్రంలో సర్కారు బాసటగా నిలిచి జీవం పోస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఎన్నడూ లేని విధంగా సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఆయా కులాల వారికి వంద శాతం సబ్సిడీతో రూ. 50వేల రుణం ఇచ్చి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. రజకులకు మోడ్రన్ ధోబీఘాట్లు నిర్మించి ఆదుకుకున్నది. హైదరాబాద్‌లో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించి అండగా నిలుస్తున్నది. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ రజకులకు ఆత్మగౌరవాన్ని మరింత పెంచింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీషాప్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నది. దీనికి అయ్యే ఖర్చును మొత్తం సర్కారే భరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 50 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే జైళ్లకు పంపించిన ఘటనలున్నాయి. ఇక నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మున్సిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ నిబంధనను మినహాయించింది. దీంతో ఆయా కులాలవారీగా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11635మంది రజకులు, 3350మంది నాయీబ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ అందుతున్నది. మునుగోడులో రెండు కులాలకు కలిపి 7వేల మందికి లబ్ధి చేకూరుతున్నది. అంతేకాకుండా 6800 ఉచిత కరెంట్ మీటర్లను అందించింది.
తరతరాల నుంచి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న రజకులకు ఇప్పుడు భరోసా లభించింది. సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రజకులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నది. నా లాండ్రీ షాపునకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా రూ.6వేల విలువైన విద్యుత్ సామగ్రిని అందించారు. నేను 20 ఏండ్లుగా రజక వృత్తిలో ఉంటూ బట్టలకు బొగ్గు పెట్టేతో ఇస్త్రీ చేసేవాడిని. రోజంతా కష్టపడితే, రూ.200 సంపాదించేవాడిని కాదు. ఇప్పు డు రోజుకు నేను రూ.500 దాకా సంపాదించి, కుటుంబాన్ని పోషించుకుంటున్న. కులవృత్తులను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్.
– వట్టికోటి సైదులు, లాండ్రీ షాపు, మునుగోడు
రజక వృత్తిదారులకు శారీరక కష్టాన్ని తగ్గించి, స్వాంతన కలిగించాలని సర్కారు సంకల్పించింది. మొదట్లో ఒక్కొక్క దోభీఘాట్‌ను రూ. 37లక్షలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని రూ. 52లక్షలకు పెంచింది. ఇందులో రూ. 17లక్షలు మిషనరీ(ఉతికేందుకు, పిండేందుకు, ఆరబెట్టేందుకు అత్యాధునిక యంత్రాలు)కి కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని సివిల్ వర్క్స్(విద్యుత్ ట్రాన్స్ఫర్మర్లు, బోర్, మోటర్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఎలక్ట్రికల్, కాంపౌండ్ వాల్) కేటాయిస్తున్నారు. ఇక ప్రభుత్వ హాస్టళ్లు, హాస్పిటళ్లలో బట్టలు ఉతకడానికి రజకులకు కాంట్రాక్టులు అప్పగించి ఉపాధి కల్పించింది.
తెలంగాణ వచ్చాక కుల సంఘాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, 40 కులాలకు స్థలాలు కూడా కేటాయించింది. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రజక, నాయీబ్రాహ్మణులకు కూడా భూమి కేటాయించింది. ఉప్పల్ భగాయత్‌లో నాయీబ్రాహ్మణులకు రెండు ఎకరాలు, రజకులకు మూడెకరాల భూమిని కేటాయించింది. నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కూడా కేటాయిచింది. ఆయా కులాలన్నీ ఏక సంఘంగా ఏర్పడేందుకు సర్కారు కృషి చేసింది. త్వరలోనే ఈ భవన నిర్మాణాలు పూర్తికానున్నాయి. కులాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
నాయీబ్రాహ్మణులు, రజకులను సర్కారు పలు విధాలుగా ఆదుకుంటున్నది. ఇందులో రెండు కులాలకు 100శాతం సబ్సిడీతో బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.50వేల రుణాలను ఇచ్చి ఆర్థికంగా సాయం చేస్తున్నది. మునుగోడులో 250మంది రజకుకులు, 120మంది నాయీబ్రాహ్మణులకు రుణాలు అందజేసి బాసటగా నిలిచింది. దీంతో ఆయా కులాల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అంతే కాకుండా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో ఆయా కులాలు టీఆర్ఎస్ సర్కారుకు జై కొడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో కారు పార్టీ వెంటే ఉంటామని మద్దతు ప్రకటిస్తున్నాయి.
కటింగ్ షాపులకు ప్రభుత్వం ఉచితంగా కరంటు ఇవ్వడంతో బిల్లుల బాధ తప్పింది.. ఆదాయం పెరిగింది. షాపులోకి వచ్చే యువత అధిక శాతం కొత్తకొత్త డిజైన్లు కోరుకోవడంతో ట్రిమ్మింగ్ మిషన్‌కు కరంటు ఎక్కువ వాడాల్సి వస్తున్నది. దీంతో కరంటు బిల్లు ఎక్కువగా వచ్చేది. ప్రస్తుతం కరంటు బిల్లులు కడుతలేం. ప్రభుత్వమే ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. గతంలో కులవృత్తి పని వచ్చి పైసలు లేకపోవడంతో చాలామంది వృత్తిని మానేస్తున్నారు. సెలూన్ షాపులను పెట్టుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీపై లోన్లు ఇస్తున్నది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు గానీ నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరంటు ఇవ్వలేదు. నాయీ బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు.
– జంపాల శ్రీకాంత్, హెయిర్ కటింగ్ షాపు నిర్వాహకుడు, నాంపల్లి
రజకుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేయూతనందించారు. రజకుల సంక్షేమానికి రూ.125 కోట్లు ఖర్చుపెట్టిన మహనీయుడు. టీఆర్ఎస్ ప్రభుత్వం రజక, నాయీబ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్ల ఉచిత కరంట్ అందిస్తూ కులవృత్తులను గౌరవిస్తున్నది. ఇప్పటివరకు 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. చాకలి అయిలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి రజకుల ఆత్మగౌరవాన్ని పెంచింది. రజకుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ వెంటే ఉంటాం..
– కొండూరు సత్యనారాయణ, తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు
మాకు వచ్చే గిరాకీతో మా జీవనం కొనసాగేదే గగనంగా ఉండేది. దానికి కరెంటు బిల్లు అధికంగా వచ్చేది. నా సంపాదనలో సగం కంటే ఎక్కువగా కరంటు బిల్లు కట్టేటోడిని. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం నాకు 250 యూనిట్లు ఉచితంగా ఇచ్చింది. దాంతో మాకు కరంట్ బిల్లు పైసలు మిగులుతున్నాయి. మా జీవితం కూడా సాఫీగా కొనసాగుతున్నది.
– మునుగోటి నాగరాజు, నాయీబ్రాహ్మణుడు (మునుగోడు రూరల్)
గతంలో మరుగునపడిన కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ సారే. సెలూన్ షాపులో కరంట్ బిల్లులకే ఎక్కవ ఖర్చు అయ్యేది. రోజంతా పనిచేసినా కరంట్ బిల్లు, ఇతర ఖర్చులకు సరిపోయేది. సీఎం కేసీఆర్ బడుగు,బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉచిత కరంట్ అందించడంతోపాటు ఆధునాతన పరికాలు కొనుగోలు చేసుకునేందుకు రుణాలు అందిస్తుం డడం అభినందనీయం.
– కానుగుల గణేశ్, నాయీబ్రాహ్మణుడు, నల్లగొండ
మా దుకాణాలకు ప్రభుత్వం ఉచిత కరంటు ఇస్తున్నది. ఏప్రిల్ నుంచే ఇది అమలవుతున్నది. మా సంపాదనలో ఎక్కువ ఖర్చు కరంటుకే అయ్యేది. ఈ పథకంతో మాకు చాలా ఇబ్బందులు తప్పాయి. గత ప్రభుత్వాలు మమ్ములను ఓటు బ్యాంకుగానే చూశాయి. మా సంక్షేమం కోసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రైతు బంధు మాదిరిగా మోడర్న్ సెలూన్ దుకాణాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు రుణాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎలక్షన్ కోడ్ పోతే, ప్రకటిస్తారేమోనని పెద్దలు చెబుతున్నారు. ఇదే ప్రకటిస్తే, మా బతుకులు మరింత బాగుపడుతాయి.
– డాకోజి గోపి, నాయీబ్రాహ్మణ సంఘం చౌటుప్పల్ పట్టణాధ్యక్షుడు (చౌటుప్పల్ రూరల్)
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. రైతులు, వృత్తిదారులు అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారు. స్వల్ప కాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. 39 వేల సెలూన్లకు 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించారు. వందశాతం రాయితీతో అధునాతన సెలూన్ల ఏర్పాటుకు రూ.50 వేల చొప్పున 15 వేల మందికి అందజేసింది. వృత్తి నైపుణ్యం పెంచేలా నాయీ బ్రాహ్మణులకు శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఎన్నికేదైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటాం.
– నాంపల్లి శ్రీను, తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు