నీలగిరి, అక్టోబర్ 29 : మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలంవారిగూడెంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్‌తో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. 24 గంటల ఉచిత కరెంటు కావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ కూడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలిచిన 2 నెలల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పని చేసే అభ్యర్థిని గెలపించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక మోదీ, అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని పేర్కొన్నారు. వారి ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘ బంధం అధ్యక్షురాలు అద్దంకి భారతమ్మ ఆధ్వర్యంలో 50 మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేటర్ దండ జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, టీఆర్ఎస్వీ నాయకులు సిరిగమల్ల కిశోర్, కొరటికల్ సర్పంచ్ వల్లూరి పద్మాలింగయ్య, ఎంపీటీసీ మిర్యాల లక్ష్మమ్మాబీరయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతగాని శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిళ్ల వెంకట్‌రెడ్డి, మందుల సత్యం, టీఆర్ఎస్, సీపీఐ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ఆదుకున్నది సీఎం కేసీఆరే..
సీమాంధ్రుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్టీసీని సరైన మార్గంలోకి తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఆర్టీసీ ఉద్యోగులు అండగా ఉండి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. శనివారం కొరటికల్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 41 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్టీసీని మరింత పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.