చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 29 : మునుగోడు ప్రజల మది నిండా సీఎం కేసీఆర్, గులాబీ జెండానే ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని డి.నాగారం గ్రామంలో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వృద్ధులు, మహిళలు, యువకులను ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల నుంచి సంక్షేమ పథకాలకు మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. ఏ ఇంటికి వెళ్లినా తమకు సాయం అందించిన సీఎం కేసీఆర్‌ను మర్చిపోమని, ఓటుతో ఆయన రుణం తీర్చుకుంటామని ఎవరెన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, పాక రమేశ్ యాదవ్, పిల్లలమర్రి సాయికుమార్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు ఓటు వేస్తామని కల్లు గీత కార్మికులు, గౌడ సంఘం ప్రతినిధులు మంత్రి వేములకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. గీత కార్మికులు ఆర్థికంగా బ లపడేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
దళితుల వ్యతిరేకి బీజేపీని ఉప ఎన్నికలో ఓడించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో శనివారం రాత్రి దళితులు, మైనార్టీలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ మోదీ ధరలు పెంచి కేసీఆర్ ఇచ్చిన డబ్బులు గుంజుకుపోతున్నాడని విమర్శించారు. అనంత గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ నారెడ్డి ఆండాలు, ఉప సర్పంచ్ నిమ్మల మమత, నా రెడ్డి అభినందన్ రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.