ఒకప్పుడు మునుగోడు కరువు ప్రాంతం.. నెర్రెలు వారిన నేలలు.. బీళ్లుగా మారిన పొలాలు.. ఎండిన బోర్లు, బావులు.. ఉపాధి లేక పల్లెలన్నీ ఖాళీ అయ్యేవి. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారెందరో!.. నాటి కష్టం గుర్తుకొస్తే కన్నీళ్లు సుడులు తిరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. బండ్లు ఓడలు అవుతాయన్నట్టు ఇప్పుడా పల్లెలు బతుకుదెరువు కోసం వచ్చే వలస కూలీలకు ఆశ్రయమిస్తున్నాయి. మిషన్ కాకతీయతో సస్యశ్యామలంగా మారాయి. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగాక ఎండిన బావులు మళ్లీ నిండాయి. బోర్లు నిండుగా పోస్తున్నాయి. పచ్చని చేలతో కళకళలాడుతున్న పల్లెలకు బతుకుదెరువు కోసం కరువు సీమల నుంచి పేదలు వలస వస్తున్నారు.
– మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. కరువు కాలాల్లో బతుకుదెరువు కోసం వలస పోవడం ఇక్కడ
సాధారణం. అలా వలసపోని పల్లె లేదు. బండ్లు ఓడలు అవుతాయన్నట్టు ఇప్పుడా పల్లెలు బతుకుదెరువు కోసం వచ్చే వలస కూలీలకు ఆశ్రయమిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! మిషన్ కాకతీయ చేసిన అద్భుతమిది. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగాక ఎండిన బావులు మళ్లీ నిండాయి. బోర్లు నిండుగా పోస్తున్నాయి. పచ్చని చేలతో కళకళలాడుతున్న ఈ
పల్లెల్లో బతుకుదెరువు కోసం కరువు సీమల నుంచి పేదలు వలస వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే మిషన్ కాకతీయ మొదలైందో. అప్పటి నుంచి మునుగోడు పల్లెల్లో సాగు పెరిగింది. బోరు పోస్తుంటే తరి పెరుగుతూ పోయింది. పత్తి పచ్చగా పెరుగుతోంది. కాపుకొచ్చిన పత్తికి కూలీలు కూడా అవసరమయ్యే సరికి ఒకప్పుడు వలసపోయిన ఊళ్లన్నీ మళ్లీ జనంతో నిండిపోయాయి. ఏటా పెరుగుతున్న భూగర్భ జలాలతో సాగుభూమి కూడా పెరుగుతోంది. పత్తి చేలల్లో కూలీల అవసరం ఎంతగా పెరిగిందంటే ఏఊరి కూలీలు ఆ ఊరికి సరిపోవట్లేదు. పక్క ఊరి కూలీలు వచ్చేట్టు లేదు. ఈ పరిస్థితుల్లో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పేదలు వలస వస్తున్నారు. ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్న వాళ్లలో కూలీలే కాదు రైతులు కూడా ఉన్నారు. రాయలసీమలో చేలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఇక్కడ బతుకుదెరువు కోసం కూలికి వచ్చామని ఆ రైతులు చెబుతున్నారు. అక్కడ అడపా దడపా పని దొరికినా కూలీ రేటు చాలా తక్కువగా ఉందని, తెలంగాణలో ఎక్కువ కాబట్టి ఇక్కడికి వస్తున్నామని రాయలసీమ కూలీలు చెబుతున్నారు. పత్తి సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే అక్కడి నుంచి కూలీలు వస్తున్నారని, నెల రోజుల్లో మునుగోడులోని అన్ని ఊళ్లలో వలస కూలీలు ఉంటారని రైతులు చెబుతున్నారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. ఎంసెట్ రాశాను. బీఎస్సీ నర్సింగ్‌లో సీటు రాగానే వెళ్లిపోతాను. అప్పటి దాకా కూలి పనులు చేస్తాను. బట్టలు, పుస్తకాలు, ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం మా వాళ్లతో కలిసి కూలికి వచ్చాను. మా వాళ్లు మూడేళ్ల నుంచి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా చండూరు మండలానికి వస్తున్నారు. చిన్నప్పటి నుంచి నేను కూలి పనులకు పోతూనే ఉన్నాను. మా ఊరి దగ్గర ఉపాధి లేక ఇక్కడికి వలస వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్కరికి రోజుకు 300 రూపాయల దాకా కూలి పడుతోంది. పత్తి బాగా పండితే 400 నుంచి 500 రూపాయలు కూలీ వస్తాది. మా ఇంట్లో ముగ్గురం ఈ కూలి పనికి వచ్చాం.
– మండారి సాగర్ మేరి, పుల్లాల చెరువు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
పుల్లాల చెరువు (ప్రకాశం జిల్లా) నుంచి 16 మంది కూలీలు చండూరు మండలంలోని తస్కానిగూడెం గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు. వాళ్ల ఊరు నుంచి ఉపాధి కోసం మునుగోడు ప్రాంతానికి నాలుగు ముఠాలు వచ్చాయని కూలీ గాలయ్య చెబుతున్నాడు. ‘మా ఊరే కాదు మా ఊరికి చుట్టుపక్కల ఉన్న చాపలమడుగు, సత్తికోడు, గంగవరం మొదలైన ప్రాంతాల నుంచి వలస వచ్చారు. మా పుల్లల చెరువు మండలంలోని అన్ని ఊళ్ల కూలీలు ఇప్పుడు మునుగోడు ప్రాంతంలోనే ఉపాధి కోసం వచ్చార’ని ఆయన చెబుతున్నాడు. గ్రామాల్లో విస్తీర్ణం పెరగడం వల్ల ఊళ్లో ఉన్న కూలీలు సరిపోవడం లేదని, అందుకే వలస కూలీలకు ఆశ్రయమిచ్చి పనులు చేయించుకుంటున్నామని తస్కానిగూడెం, బంగారిగడ్డ, తిమ్మారెడ్డిగూడెం, తుమ్మలపల్లి రైతులు చెబుతున్నారు. వలస కూలీలకు కూడా స్థానిక కూలీలకు లెక్కగట్టినట్టే ఏరిన పత్తికి రేటు కట్టి ఇస్తున్నామని, అయితే వలస కూలీలకు కట్టెలు, వసతి అదనంగా ఇవ్వాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ‘ఖర్చు ఎక్కువయినా ఫర్వాలేదు’ పంట వానలకు ఆగం కాకుండా ఇంటికి చేరితే అదే మేలని రైతులంటున్నారు.
మాకు తొమ్మిదెకరాల భూమి ఉంది. రెండెకరాలు మిరప, ఆరు ఎకరాలు పత్తి పెట్టిన. పత్తి చేనంతా ఎండిపోయింది. నీళ్లు లేక ఏటా ఇట్లానే అవుతోంది. మా దగ్గర వ్యవసాయం బాగా లేదు. అక్కడ చేయడానికి ఏ పనీ లేదు. ఉన్నా కూలీ తక్కువ. ఈ సమయంలో బతకాలంటే వలస తప్పదు. నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మ పిల్లల్ని చూసుకుంటుంది. మూడేండ్ల నుంచి ఇక్కడ పంటచేలు బాగున్నాయి. పత్తి తీయడానికి మూడేండ్ల నుంచి వస్తున్నాం. మునుగోడు ప్రాంతంలో మా రాయలసీమ నుంచి వచ్చిన కూలీలు చాలా ఊళ్లలో ఉన్నారు. పత్తి తీసే సీజన్లో ఏటా వస్తున్నాం. సీజన్ ఇప్పుడే మొదలైంది. ఇంకా వస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి వస్తారు. .
– మల్లికార్జున్, మాలపల్లి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
నిరుడు రెండెకరాల్లో పత్తి వేస్తే ఒక్క బస్తా నిండలేదు. ఈ ఏడు కూడా అలాగే ఉంది. మూడేళ్ల నుంచి పత్తి తీయడానికి తుమ్మలపల్లి (చండూరు మండలం)వస్తున్నాం. చిన్నోడికి మాటలు రావు. చిన్న కొడుకుని, ఆవుల్ని చూసుకుంటూ మా ఆయన ఊళ్లోనే ఉన్నాడు. నేను పెద్ద కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాను. రోజూ 30 నుంచి 40 కేజీలు పత్తి తీస్తాం. రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల ఆదాయం వస్తుంది. పత్తి బాగా పండితే రోజుకు క్వింటా వరకు తీస్తాం.
– రామక్క , మాలపల్లి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్