చౌటుప్పల్, అక్టోబర్ 29 : కుట్రల బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కనీయొద్దని యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని విస్తృతం చేసుకోవాలని ఆకాంక్షించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసం అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మండలంలోని లింగోజిగూడెం, తాళ్లసింగారం, లక్కారం, చౌటుప్పల్ గ్రామాల్లో శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పన్నాగం పన్నిందని దుయ్యబట్టారు. ఇంతటి కుసంస్కార కాషాయ పార్టీకి ఈ ఎన్నికలో తగిన బుద్ధి చెప్పి తీరాలని పిలుపునిచ్చారు.
రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు విసిరి ఉప ఎన్నిక తెచ్చిన పాపం బీజేపీదేనని విమర్శించారు. కాంట్రాక్టులు తప్ప నియోజకర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని అసమర్థుడు రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు. బీజేపీకి, రాజగోపాల్‌కు గుణపాఠం చెప్పేందుకు ఈ ఉప ఎన్నికే సరైన ఆయుధమని స్పష్టం చేశారు. ఐదేండ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మి ఇక్కడి ప్రజలు ఓటేస్తే.. వారి నమ్మకాన్ని నట్టేట ముంచిన ఘనడు రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మూడేండ్లకే ఉప ఎన్నిక తెచ్చి ప్రజలపై భారం మోపిన పాపం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుభవించాల్సిందేనన్నారు.
ఎమ్మెల్యే గా గెలుపొందాక ఏనాడూ గ్రామాల ముఖం చూడని రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానన్న మాటలను ఎందుకు నిలుపుకోలేదని ప్రశ్నించారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి బాగోగుల గురించి ఆలోచిస్తున్న టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఈ ఎన్నికలో ఆశీర్వదించాలని కోరారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు లాంటి అద్భుతమైన పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలందరూ మద్దతుగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అఖండ మెజార్టీని అందించాలని కోరారు. ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, బత్తుల రాజ్యలక్ష్మీ స్వామిగౌడ్, లింగస్వామి పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఓటర్లంతా కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మునుగోడు ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే నియోజవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గెలుపోటములకు అతీతంగా తాను ప్రజల మధ్యనే ఉంటున్నానని, ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. రాజగోపాల్‌రెడ్డి చెత్తను డంప్ చేస్తానన్న చోటే తాను గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయించి ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించానని గుర్తు చేశారు. 2014లో తనను గెలిపించిన ప్రజల కోసం రూ.600 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు.
కానీ తనను గెలిపిస్తే ఒక్క కొబ్బరికాయ కొట్టి వంద పనులు చేస్తానని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ మాటను గాలికొదిలేసి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కాంట్రాక్టుల కోసం పాకులాడాడని విమర్శించారు. తాను రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోలేదని, రూ.18 వేల కోట్లకే అమ్ముడుపోయానని రాజగోపాల్‌రెడ్డే స్వయంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టు కోసం ఎమ్మెల్యే పదవిని తాకట్టుపెట్టిన రాజగోపాల్‌రెడ్డికి మరోమారు ఓటు వేసి మోసపోవద్దని కూసుకుంట్ల పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేస్తే రైతుల బోరు బావులకు 24 గంటలూ ఉచిత కరంటు వస్తుందని వివరించారు. అదే బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే అదే బోరు బావుల మోటర్లకు మీటర్లు వస్తాయని గుర్తుచేశారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.