మునుగోడు, అక్టోబర్ 29 : మునుగోడులో ఓటమిని బీజేపీ ఇప్పటికే ఒప్పుకొన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెల రోజుల్లో పడగొడుతామని బీజేపీ జాతీయ నేత అమిత్ షా అప్పుడే అన్నారని, దానిని అమలు చేసే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం బెడిసికొట్టడంతో ఇప్పుడు బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి డబ్బును, అమ్ముడుపోయే నాయకులను నమ్ముకున్నారని విమర్శించారు. చివరికి బీజేపీ కూడా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనే అభ్యర్థిగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
నిఖార్సయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని, ఎంత ప్రలోభపెట్టినా తమ నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి మాత్రం రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. మోదీ నుంచి రక్షించాలని బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని వారు నమ్ముతున్నారని అన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ గడ్డపై కాలు మోపబోతున్నారని తెలిపారు.
సీఎం తెలంగాణలోనే ఆపే కుట్రలో రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ పావుగా వాడుకున్నదని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, జడ్పీటీసీ నారాబోయిన స్వరూపారాణి, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, నారబోయిన రవి ఎంపీటీసీలు బొడ్డు శ్రావణీ నాగరాజుగౌడ్, ఈద నిర్మలా శరత్‌బాబు, జూనియర్ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కుమారస్వామి, నాయకులు శ్రీను, వెంకన్న, భిక్షం పాల్గొన్నారు.
మునుగోడు, అక్టోబర్ 29 : టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీలను చిన్నచూపు చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేసి షాదీ ముబారక్, రంజాన్ తోఫా, 12 శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింలను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు? ఎవరి స్వార్థం కోసం వచ్చిందో? మీ అందరికీ తెలుసన్నారు. అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీలో ఉన్న తమ్ముడికి ఓటేయాలని అంటున్న కుట్రదారులకు బుద్ధి చెప్పాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న పార్టీలకు కర్రు కాల్చి వాతపెట్టాలని సూచించారు. అందరం ఏకతాటిగా నిలబడి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని పెండింగులో ఉన్న పనులన్నింటినీ ఉప ఎన్నికల అనంతరం పూర్తి చేసుకుందామని మైనార్టీలకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీక్, ఎండీ సాజిద్, ఎండీ వాజిద్, ఎండీ యూనిస్, మహ్మద్ వాజిద్, ఎండీ గాలిబ్, మహ్మద్ షబ్బీర్ అలీ, ఖాలీద్, రషీద్, సయ్యద్ పాల్గొన్నారు.