చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 27 : మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని నిధులు తెచ్చి ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా మండలంలోని జైకేసారం, కుంట్లగూడెం, ఎస్.లింగోటం, నేలపట్ల, మందోళ్లగూడెం, చిన్నకొండూర్, మసీదుగూడెం, శేరీల్లా, పెద్దకొండూర్, ధర్మోజిగూడెం గ్రామాల్లో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఓటర్లంతా కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థినైన తాను గెలిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
గోల్మాల్ రాజగోపాల్‌రెడ్డి మాయమాటలకు మరోసారి మోసపోవద్దని సూచించారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఇదేనన్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పొరపాటున వారి మాటలు నమ్మి మరోసారి మోసపోతే అరిగోస పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దలకు రాజగోపాల్‌రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఇప్పుడు రాజీనామా డ్రామాతో మునుగోడు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఇన్చార్జీలు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, సండ్ర వెంకటవీరయ్య, మైనంపల్లి హనుమంతరావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్, టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని జైకేసారం, కుంట్లగూడెం, ఎస్.లింగోటం, నేలపట్ల గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నీరాజనం పలికారు. ప్రతీ గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బోనాలు, బతుకమ్మలు, పీర్లు, పటాకులతో ఘనంగా స్వాగతం పలికారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలను పలుకరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.