టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన బీజేపీపై గులాబీ సైన్యం గర్జించింది. గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనాలు చేశాయి. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించాయి. బీజేపీ కుట్రలను ఎండగట్టేందుకు రైతులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి నీచమైన చర్యలకు ఒడిగట్టిందని మండిపడ్డారు.
బీజేపీ బేరసారాల కుట్రపై టీఆర్ఎస్ శ్రేణులు గర్జించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. గ్రామగ్రామాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల శవయాత్రలు నిర్వహించాయి. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదలు చేశాయి. అనేక చోట్ల మహిళలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపురంలోని సర్వేల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాంపల్లిమండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రం తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ తండాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ బేరసారాలకు వ్యతిరేకంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. చండూరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు చావుడప్పు కొట్టి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.
చండూరు మండలంలోని ఉడుతపల్లిలో గులాబీ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను కాల్చారు. నాంపల్లి మండలంలోని ముష్టిపల్లిలో ఎంపీ మాలోతు కవిత ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మర్రిగూడ మండలంలోని శివన్న గూడెంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో, సరంపేటలో, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో, చిన్నకొండూరులో దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
చండూరు, అక్టోబర్ 27 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ఆగం చేయాలనే కుతంత్రంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గురువారం మండలకేంద్రంలో ప్రభుత్వ విప్ సుమన్, మిత్రపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారనే భయంతో కొనుగోళ్ల పర్వానికి దిగిందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మిత్రపక్ష నాయకులు జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి వెంకన్న, చిలుకూరి రాధికాశ్రీనివాస్, కొండ్రెడ్డి యాదయ్య పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 27 : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి స్వామీజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంత్రి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్వేల్ గ్రామంలో గురువారం ధ ర్నా నిర్వహించారు. బీజేపీ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహ నం చేశారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కమలం పువ్వు వాడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశ్గౌడ్, సర్పంచ్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 27 : బీజేపీ కుట్ర తేటతెల్లమైంది.. డబ్బులకు ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనాలనే తీరును దేశమంతా చూసింది. చరిత్రలోనే ఇదొక్క చీకటి రోజు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మండలంలోని పొర్లగడ్డతండా పరిధి మర్రిబావి తండాలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి లాగా అందరూ అమ్ముడుపోరని అన్నారు. ఆత్మగౌరవంతో బతుకుతున్న తెలంగాణ బిడ్డలు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. దొంగచాటుగా స్వాములను పంపించి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశ ప్రతిష్టను దిగజారిస్తున్నారని మండిపడ్డారు.మునుగోడు ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజూనాయక్, మాజీ సర్పంచ్ బిచ్చా నాయక్, చండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 27 : దేశం సిగ్గుపడేలా మైన రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ గురువారం చౌటుప్పల్ మండలం డి.నాగారంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లు పెట్టి కొనాలనే ప్రయత్నాన్ని నిఖార్సైన తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టారన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ కుట్రలకు తెరలేపారన్నారు. వారి కుట్రలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడుపోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డిలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని ఆయన స్పష్టం చేశారు.
నాంపల్లి, అక్టోబర్ 27 : బీజేపీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే అని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించడాన్ని నిరసిస్తూ గురువారం నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఎంపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారనే ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రపన్నిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే కూసుకుంట్లను గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గంలోని తండాల్లో ఫ్లోరోసిస్ ప్రభా వం ఉండేదని, నాటి ప్రధాన మంత్రులకు మొరపెట్టుకు న్నా పరిష్కరించలేకపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మంచినీటిని అందించిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.