చిమ్ముతున్నది. మునుగోడులో ఓడిపోతామన్న భయంతో కుట్రలకు తెరలేపింది. కుయుక్తులతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నీచ సంస్కృతికి ఒడిగట్టింది. కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవులు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నెరిపేందుకు వచ్చిన స్వాములు రామచంద్రభారతి, సింహయాజులు, వ్యాపారి నందకూమార్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీజేపీ బరితెగింపుపై మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు భగ్గుమన్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభివర్ణిస్తున్నాయి. కాషాయ పార్టీ కుట్రలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దిగజారుడు రాజకీయాలపై మండిపడుతున్నాయి. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు ఒడిగట్టారని పేర్కొన్నాయి.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ)
బీజేపీ బరితెగింపుపై మేధావులు, ప్రజాసంఘాలు, నాయకులు భగ్గుమన్నారు. క్యాషాయ పార్టీ బేరసారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలపై మండిపడుతున్నారు. విలువలు లేకుండా నీచ రాజకీయాలు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. బీజేపీ కుట్రను ముక్తకంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో సంతల్లో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం ఏంటని నిలదీస్తున్నారు. ఒక ఉప ఎన్నికల్లో గెలవడానికి ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముందని కమలం పార్టీని తీరును ఎండగడుతున్నారు.వందల కోట్లను ఆశచూపుతున్నారని, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీలను అడ్డదారిలో పడగొట్టి, దుర్మార్గపు పాలన చేస్తున్నదని తూర్పార పడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇదే తంతు కొనసాగించిందని తిట్టిపోస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇది పరాకాష్టగా పేర్కొన్నారు. కేంద్రం తన జేబు సంస్థలను వాడుకొని ఇష్టమున్నట్లు వ్యవహరిస్తున్నదని, బీజేపీని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేస్తున్నదని, కాషాయ పార్టీ తన దుర్బుద్ధిని మార్చుకొని, రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని హితవు పలికారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటు. ఇదా బీజేపీ పాలనా? గతంలో మహారాష్ట్ర, గోవాలాంటి రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొన్న విధంగానే ఇక్కడ చేయాలని చూశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లాగే గానీ, ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులు బాధాకరం. వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అనుబంధ శాఖలతో విచారణ చేపట్టి, బీజేపీపై చర్యలు తీసుకోవాలి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కోలేకే ఇలాంటి పనులకు పూనుకోవడం తగదు. తెలంగాణ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. అందులో భాగస్వాములైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దుర్మార్గపు బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు. మతపరమైన కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది.
– కంబాలపల్లి ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు(దేవరకొండ)
బీజేపీ ఇప్పటికే ఎనిమిది రాష్ర్టాల ప్రభుత్వాలను అక్రమ పద్ధతిలో కూలదోసి, గద్దెనెక్కింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతకు గురి చేసేందుకు నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికింది. గతంలో కాంగ్రెస్‌కు నైతిక విలువలు లేవని విమర్శించిన బీజేపీ, కాంగ్రెస్ కన్నా 10 రేట్లు అధ్వానంగా వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నది. కొంతకాలం నుంచి అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని బీజేపీ నాయకులు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగి ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడమే కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేయాలని చూస్తుండటాన్ని ఖండించాలి.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను నోటుతో కొనాలనుకోవడం హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. మునుగోడులో ఓటమి ఖాయమని తెలుసుకుంది. అందుకే ఏదో రకంగా దెబ్బకొట్టాలని భావించి నీచపు చర్యలకు పాల్పడింది. ఏకంగా ఎమ్మెల్యేలనే కొనాలని చూడడం సిగ్గుమాలిన పనే తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న జాతీయ పార్టీపై ఉంది. ఇతరుల తప్పు చేస్తే, మందలించి, విలువలను కాపాడాల్సిన వారే ఇలాంటివి చేయడం దుర్మార్గం. గెలువ లేక దొంగ దెబ్బ తీద్దామనుకేంటే బీజేపీని ప్రజలు క్షమించరు. ఓటుతో తగిన బుద్ధి చెబుతారు.
– చెలిమెండ్ల్ల పద్మయ్య,న్యాయవాది, మిర్యాలగూడ(మిర్యాలగూడ రూరల్)
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి, రాజకీయ కుతంత్రాలతో బీజేపీ ఈ దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పడగోతూ వస్తున్నది. ఇప్పటికే పుదుచ్చేరి, సిక్కిం, మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టి, అడ్డదారుల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూడడం సిగ్గు చేటైన విషయం. రాజకీయ విలువలను తుంగలో తొక్కి, ఓటు వేసిన ప్రజలను లెక్క చేయకుండా అధికారమే లక్ష్యంగా రాజకీయ దుర్నీతికి బీజేపీ అల్లాడుతున్నది. వందల కోట్లతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నది. ప్రజాస్వామ్య హంతకులను ప్రజాక్షేత్రంలో శిక్షించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఇలాంటి దుర్మార్గాలకు ఎవరు ఒడిగట్టినా ఖండించాల్సిందే.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ నీతిమాలిన వ్యవహారానికి పాల్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చూసింది. దేశానికి దిశానిర్దేశం చేసి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, భవిష్యత్ నిర్ణయించాల్సిన బీజేపీ నేతలు, ఇలాంటి చర్యలకు పాల్పడం వారి దిగజారుడు తనానికి నిదర్శనంగా నిలుస్తున్నది. దీన్ని టీజేఎస్ పూర్తిగా ఖండిస్తున్నది. ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేలా డబ్బులను ఎర చూపడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే, ప్రజలు తగిన సమయంలో కచ్చితంగా బీజేపీకి బుద్ధి చెబుతారు. ప్రభుత్వాలు సైతం ఇలాంటి కుట్ర పూరిత చర్యలు చేయడం సరికాదు.
– పన్నాల గోపాల్‌రెడ్డి, టీజేఎస్
ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అభినందనలు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు. అధికార దాహంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టే. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత గెలిచిన వాళ్లు డబ్బులకు అమ్ముడుపోరనేలా ఆ నలుగురు ఎమ్మెల్యేలు నిరూపించడం హర్షణీయం. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని నిబంధనల మేరకు కఠినంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడిన బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
– నిమ్మల భీమార్జున్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది, నల్లగొండ
ప్రజా క్షేత్రంలో గెలువడానికి ప్రయత్నాలు చేయాలి. కుట్రపూరితంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. డెమోక్రసీకి ఇది విరుద్ధం. ప్రజల హక్కులను కాలరాసే దురుద్దేశంతో బీజేపీ ఇలాంటి మోసపూరిత చర్యలకు దిగడం దారుణం. ప్రజలు, యువతకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. ప్రజలకు అవసరమైన అంశాలు కల్పించకుండా ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపర్చి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించేలా చేయడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– ఎడ్ల సైదులు, టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
ప్రజలు ఎన్నుకున్న నాయకులకు డబ్బు ఎర చూపి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బీజేపీ కుటిల రాజకీయాలతో ప్రజాస్వామ్యం బ్రష్ఠు పట్టింది. ఎమ్మెల్యేలను డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపి పార్టీ మార్చేందుకు కుట్ర చేయడం సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకొనే విధంగా మంచి పాలన కొనసాగించాలి. ప్రజల మద్దతు లేకున్నా, ఎమ్మెల్యేలు చాలినంత లేకున్నా పలు రాష్ర్టాల్లో బీజేపీ ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చడం మంచి పద్ధతి కాదు. తెలంగాణలో కూడా అదే పద్ధతిలో ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన సాగించి, ప్రజల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలే గానీ, కుటిల రాజకీయాలతో దొడ్డిదారిన అధికారంలోకి రావాలనీ చూడడం మంచి పద్ధతి కాదు.
– మిట్టపల్లి శ్రీధర్, న్యాయవాది, దామరచర్ల
కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తున్న బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేకే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నది. ప్రజాదరణ ఉన్న పార్టీ అయితే, వేరే పార్టీల ఎమ్మెల్యేలను పైసలతో కొనాల్సిన అవసరం ఉండదుగా. ప్రశాంతంగా రాష్ర్టాల్లో పరిపాలన సాగుతుంటే కుట్రలతో ఆ ప్రభుత్వాలను కూలగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టి విద్య. మతతత్వ పార్టీ బీజేపీని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. కొనుగోళ్ల ప్లాన్‌ను చూస్తే బీజేపీ భారీ కుట్రకు తెర లేపినట్లుగా తెలుస్తున్నది.
– నాంపల్లి చంద్రమౌళి, ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు