‘గ్యాస్ ధర ఆకాశానికి అంటింది.. కట్టెల పొయ్యి దిక్కైంది.. సామాన్యుడికి గుది‘బండ’గా మారింది’ అంటూ మహిళలు వంట గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలుచోట్ల సిలిండర్లతో వినూత్న నిరసన చేపట్టారు.ఉట్టికి ఎక్కిన సిలిండర్‌తోపాటు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
గట్టుప్పల్/ చౌటుప్పల్/ నాంపల్లి, అక్టోబర్ 27 : ఇస్తానుసారంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న మోదీ ప్రభుత్వంపై మహిళలు తిరుగబడ్డారు. గురువారం గ్యాస్ సిలిండర్లతో ర్యాలీలు నిర్వహించారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి నిరసన తెలిపారు. పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. గట్టుప్పల్ మండలకేంద్రంలో తాసీల్దార్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు మహిళలు మోదీ డౌన్ డౌన్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద చౌరస్తాలో కట్టెల పొయ్యిపై వంటలు చేసి, గ్యాస్ సిలిండర్లను ఉట్టికెక్కించి నిరసన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ పట్టణం లక్కారంలో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు.
బతుకమ్మ.. మాకు బతుకే లేకుండా పో తోందమ్మా.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటకు బదులు.. ధరలు తగ్గించండి ఉయ్యాలో..’ అంటూ పాడారు. నాంపల్లి బస్టాండ్ కేంద్రం నుంచి సుమారు 150 మంది మహిళలు భారీ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో గ్యాస్ బండకు ఉరి తాడు వేసి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ రేట్లు పెంచడంతో కుటుంబాలు వెళ్లదీయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తగ్గించడం చేతకాకుంటే అధికారం నుంచి దిగిపోవాలని నినదించారు. గట్టుప్పల్ సర్పంచ్ ఈడెం రోజ తో పాటు పలువురు మహిళలు మాట్లాడారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను విడుతల వారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.1200కు చేరువ చేశారన్నారు. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారిందన్నారు. కార్యక్రమం లో గట్టుప్పల్ మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం, అక్టోబర్ 27 : వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తగ్గించాలని కోరుతూ సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిమిర్యాల గ్రామంలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ సిలిండర్‌ను చెట్టుకు వేలాడదీసి నిరసన తెలిపారు. సామాన్యుడిపై గుదిబండగా మారిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను అమాంతం పెంచిందంటూ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సిలిండర్ చుట్టూ బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
మునుగోడు, అక్టోబర్ 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడాన్ని నిరసిస్తూ మండలంలోని గూడపూర్ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి జ్యోతి, కల్వపల్లి ఎంపీటీసీ ఒంటెపాక వెంకటమ్మ, మహిళలు మోగదాల పద్మ, సైదమ్మ, సౌందర్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.