మునుగోడు నియోజక వర్గానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మరోసారి పర్యటించనున్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉప ఎన్నికను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సభా స్థలి వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో జనం నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నది. టీఆర్ఎస్ గెలిస్తే మునుగోడు ఎలా అభివృద్ధి చెందనున్నది..? ఏం చేయనున్నది? సీఎం కేసీఆర్ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉప ఎన్నిక ప్రారంభంలోనే మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. చండూరులో మరో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంందామని ఆ సభలోనే చెప్పారు. దీంతో కేసీఆర్ ముఖ్య అతిథిగా మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు స్థల పరిశీలన చేయగా, గురువారం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్రావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ వేదిక, సీటింగ్ విధానం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు, సౌండ్ అండ్ లైటింగ్, ఇతర సదుపాయాల కల్పనను పర్యవేక్షించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి నీటి సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సభ అంటేనే జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఎన్ని పనులున్నా.. ఎంత దూరమైనా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం చెవులు నిక్కపొడుచుకుని వింటారు. అలాంటి కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి వచ్చేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛందంగా తరలిరావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మునుగోడులో జరిగిన సభకు జనం భారీగా హాజరయ్యారు. ఇప్పుడు అంత కంటే అధికంగా తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా గులాబీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం గడువు సమీపిస్తున్నది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఓ కీలక నేతను ఇన్చార్జ్గా నియమించారు. వీరితోపాటు ప్రతి 100మంది ఓటర్లకు మరో ఇన్‌చార్జ్‌ను పెట్టారు. దాంతో వారంతా గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గల్లీగల్లీలో టీఆర్ఎస్ కార్యకర్తలే దర్శనమిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకే ఓటేయాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఊర్లన్నీ గులాబీమయంగా మారాయి. జనం సైతం స్వచ్ఛందంగా గులాబీ ప్రచారానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఏకపక్షంగా మారుతున్నది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలోకి టీఆర్ఎస్ దాటిపోయింది. ఏ సర్వే చూసినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని తేల్చిపారేస్తున్నాయి. ఏ ఊరిలోకి వెళ్లినా.. ఎవరిని కదిలించినా.. ఏ వ్యక్తిని కలిసినా గెలుపు టీఆర్ఎస్దే అనే మాట వినిపిస్తున్నది. అది కూడా భారీ మెజార్టీ అని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం టీఆర్ఎస్ హవాను తట్టుకోలేక తలలు పట్టుకుంటున్నాయి. బీజేపీ ఏకంగా మూడో స్థానానికి పరిమితమవుతుందని సర్వత్రా వినిపిస్తున్నది. కారు పార్టీనే గెలిపిస్తామని, కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమనే దృఢ సంకల్పంతో జనం ఉన్నారు. ఎన్నకల్లోనూ కారు గుర్తుకు ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.
బంగారిగడ్డలో జరగనున్న బహిరంగసభకు గురించి అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. సభలో కేసీఆర్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో తూర్పారబట్టనున్నారు. కేంద్రం, బీజేపీపై నీచ రాజకీయాలను చీల్చి చెండాడనున్నారు. ఇప్పటికే మూడున్నరేండ్లుగా మునుగోడు అభివృద్ధి కుంటుపడింది. రాజగోపాల్‌రెడ్డి నిర్వాకంతో పనులన్నీ ఆగిపోయాయి. అయితే టీఆర్ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేయబోతున్నరనే క్లారిటీ రానుంది. ఇక్కడి ప్రజలకు పలు హామీలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ నెల 30న బంగారిగడ్డలో బహిరంగ సభ నిర్వహించనున్నాం. సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అథిగా విచ్చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సభ ఎప్పుడు జరుగుతుందా.. ఎప్పుడు తరలివద్దామా అని జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మేం ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉన్నాం. భారీ మెజార్టీతో గెలువబోతున్నాం. మా విజయాన్ని ఎవరూ ఆపలేరు.
– తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ, జిల్లా ఎన్నికల ఇన్చార్జి