యాదాద్రి, సెప్టెంబర్ 11 : స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం పులకించింది. వరుస సెలవులు కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం కిక్కిరిసిపోయింది. స్వయంభువుడి దర్శనం అద్భుతంగా జరిగిందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.38,22, 868 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఈ నెల 13న స్వామివారి హుండీలను లెక్కించనున్నట్లు తెలిపారు.
యాదాద్రీశుడిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం యాదాద్రికి చేరుకున్న వారు స్వయంభువుడికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ డీటీసీపీ రీజినల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్ కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 2,66,150
వీఐపీ దర్శనం 3,00,000
వేద ఆశీర్వచనం 6,600
నిత్య కైంకర్యాలు 1,600
సుప్రభాతం 2,500
క్యారీబ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 1,25,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 37,400
ప్రసాద విక్రయం 17,06,100
వాహనపూజలు 10,000
అన్నదాన విరాళం 19,596
సువర్ణ పుష్పార్చన 1,49,948
యాదరుషి నిలయం 1,03,144
పాతగుట్ట నుంచి 29,440
కొండపైకి వాహన ప్రవేశం 4,50,000
లక్ష్మీ పుష్కరిణి 700
శివాలయం 8,100
లీసెస్ 5,60,990