నల్లగొండ, ఆగస్టు 6 : ఏఎంఆర్పీ పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాల్వలకు వానకాలం సీజన్‌కు సంబంధించి సాగునీటి విడుదల షెడ్యూల్‌ను నీటిపారుదలశాఖ విడుదల చేసింది. నీటిపారుదల ఎస్ఈ వి. అజయ్‌కుమార్ ఎస్‌ఎల్‌బీసీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. హైలెవల్తో పాటు లోలెవల్ కెనాల్‌కు 120 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ రెండు కాల్వల పరిధిలో 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా వారబందీ పద్ధతిలో డివిజన్ల వారీగా నీటిని విడుదల చేయనున్నారు. లోలెవల్ కెనాల్‌కు నేటినుంచే హైలెవల్ కెనాల్‌కు ఈనెల 10 నుంచి విడుదల చేయనున్నారు.
హైలెవల్ కాల్వ పరిధిలో 2.35
హైలెవల్ కాల్వ పరిధిలో డీ 5 నుంచి డీ 55 వరకు డిస్ట్రిబ్యూటరీలు ఉండగా వాటి కింద 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి పారుదలశాఖ ఈ డిస్ట్రిబ్యూటరీలను 4 ,5,7 డివిజన్లుగా విభజించింది. వీటికి ఈ నెల 10 నుంచి డిసెంబర్ 7 వరకు 120 రోజుల పాటు సాగు నీటిని విడుదల చేయనున్నారు. వారబందీ పద్ధతిలో నీటి విడుదల జరుగనున్న నేపథ్యంలో ఒక వారం 4, 5 డివిజన్లకు మరో వారం 5, 7 డివిజన్లకు ఇంకో వారం 4, 7 డివిజన్ల చొప్పున రొటేషన్ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ కాల్వకు పుట్టంగండి నుంచి నీటి విడుదల జరుగనుండగా.. వీటి కింద పెద్దఅడిశర్లపల్లి, పెద్దవూర, గుర్రంపోడు, కనగల్, నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూర్, నార్కట్‌పల్లి , నకిరేకల్, కేతేపల్లి మండలాలకు సాగు నీరు అందనున్నది. ఈ కాల్వలకు రెగ్యులర్‌గా 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. సాగు నీటితో పాటు కాల్వల పరిధిలో ఉన్న చెరువులను కూడా నింపనున్నారు.
లోలెవల్ కెనాల్ కింద..
లోలెవల్ కెనాల్ కింద ఆరు మండలాల్లోని 50వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ కెనాల్‌కు పెద్దవూర మండలంలోని పుల్యాతండా నుంచి నీరు విడుదల కానుండగా పెద్దవూరతో పాటు అనుముల, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి మండలాలకు నీరు అందనుంది. ఈ నెల7 నుంచి డిసెంబర్ 4 వరకు వారబందీ పద్ధతిలో 600 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు.
నీటిని వృథా చేయవద్దు
వానకాలం సీజన్‌కు సంబంధించి పంటల సాగు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎమ్మార్పీ పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాల్వలకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నాం. ఈ నీటిని రైతులు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఒక వారం రెండు డివిజన్లకు ఇంకో వారం మరో డివిజన్‌కు నీటి విడుదల చేస్తాం. కాల్వలు తెంపటం, గేట్లు అక్రమంగా లేపటం వంటి చర్యలకు పాల్పడవద్దు. రెండు కాల్వల పరిధిలో 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.