రాజాపేట, జూలై 16 : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఒగ్గు కళకు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఉంది. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న నేటి తరుణంలోనూ ఒగ్గు కథకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. గొల్లకుర్మల కులస్తులైన ఒగ్గు కళాకారులు వివిధ వేషధారణలతో శరుణు శరుణు మాయమ్మా రాణీ.. శాంభావి రాణీ.. శాంభావి రాణీ… కరుణ చూడు మా కన్నతల్లీ..
గంగాభవానీ… అనే పాటలతో ప్రజలను
ఆకట్టుకుంటున్నారు. డోలు చప్పుడు, తాళాల ధ్వనులతో లయాత్మకంగా సాగుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. ఒగ్గు కళపై ఆధారపడి పలువురు కళాకారులు జీవనం సాగిస్తున్నారు.
రాజాపేట మండలంలోని బేగంపేట, పాముకుంట, దూదివెంకటాపురం, కొత్తజాల, సింగారం, బొందుగుల, రఘునాథపురం గ్రామాల్లో వంద మందికి పైగా ఒగ్గు కళాకారులు ఉన్నారు. తెలంగాణలో విశేష ఆదరణ ఉన్న ఒగ్గు కథను నమ్ముకొని వీరు జీవనం సాగిస్తున్నారు. నలుగురి నుంచి ఆరుగురి వరకు బృందంగా ఏర్పడి యాదాద్రి జిల్లాతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో ఒగ్గు కథలు చెప్తూ జీవనోపాధి పొందుతున్నారు. డోలు, తాళాల మధ్య మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ, కీలుగుర్రం, కాటమరాజు, పెద్దిరాజు, సువర్ణసుందరి, సారంగధార, బయ్యమ్మ కాంబోజురాజు, అల్లిరాణి, నాగమ్మ, మరిచంద్ర, మార్కండేయ పురాణం, నల్ల పోచమ్మ, బాలనాగమ్మ కథలను వినసొంపుగా రసభరితంగా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒక్కోచోట మూడు నుంచి ఐదు రోజులపాటు వివిధ వేషధారణాలతో కథలు చెప్తుంటారు.
ఒగ్గు కళతో జీవనం
మా కుటుంబమంతా ఒగ్గు కళాకారులే. నా చిన్నప్పుడే ఒగ్గు కళను నేర్చుకున్నా. తర్వాత కుటుంబ సభ్యులందరికీ నేర్పించా. ఒగ్గు కథకు విశేష ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులమంతా హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో వివిధ రకాల కథలను ఒగ్గు కళారూపంలో చెప్పి జీవనం సాగిస్తున్నాం.
– దేవనపల్లి ఐలయ్యయాదవ్, బేగంపేట