ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, ఆ పక్కనే ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తూ క్రస్ట్‌గేట్ల మీదుగా కృష్ణానది శ్రీశైలాన్ని ముద్దాడుతున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోనూ వేగంగా నీటిమట్టం పెరుగుతూ వస్తున్నది. వరద మొదలైన నాలుగు రోజుల్లోనే 30 అడుగుల మేర నీటిమట్టం పెరుగడం విశేషం. ఈ వరద ఇలాగే కొనసాగితే రానున్న రెండుమూడు రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకోనున్నాయి. ఇక ఇదే జరిగితే ఆ నీరంతా నాగార్జునసాగర్‌కే చేరుకోనుంది. మరోవైపు శ్రీశైలంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తిని ప్రారంభించడంతో సగటున 30వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు నాగార్జునసాగర్‌కు వచ్చి చేరుతున్నది. సాగర్‌లోనూ ఒక్క అడుగుకు పైగా నీటిమట్టం పెరిగింది.
దీంతో సాగర్ ఆయకట్టులోని రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : గోదావరితో పోలిస్తే కొంత ఆలస్యమైనా కృష్ణానదిలోనూ భారీ వరద ఉధృతి కొనసాగుతుంది. పది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. పై నుంచి కింది వరకు ఒక్కో ప్రాజెక్టు నిండుకుంటూ ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 3,14,356 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తున్నట్లు డ్యామ్ అధికారులు ప్రకటించారు.
ఇందులో జూరాల నుంచి 1.52లక్షలు, రోజా నుంచి 1.61లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853.70 అడుగులకు చేరుకుంది. సరిగ్గా ఈ సీజన్లో వరద ప్రారంభమయ్యే సమాయానికి అంటే ఈ నెల 12న శ్రీశైలంలో 824.50 అడుగుల నీటిమట్టం నమోదై ఉంది. ఈ నాలుగు రోజుల్లోనే 30 అడుగుల మేర పెరిగి 44 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 88.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా సాగర్‌కు..
సమైక్య రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలైనా పూర్తిగా నిండి గేట్లు ఎత్తే సమయంలోనే సాగర్‌కు నీటి విడుదల జరిగేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలైన నాటి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో పవర్ జనరేషన్ ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తూ వస్తున్నారు. వరుసగా మూడేండ్లుగా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ సీజన్లోనూ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద మొదలైన రోజు నుంచే కరెంటు ఉత్పత్తి చేస్తుండడంతో సాగర్‌కు నీటి రాక మొదలైంది.
సగటున 30వేల క్యూసెక్కుల నీరు పవర్ జనరేషన్ ద్వారా సాగర్‌కు వస్తుంది. దీంతో సాగర్‌లోనూ మూడ్రోజులుగా ఒకటిన్నర అడుగుల మేర నీటిమట్టం పెరుగడంతోపాటు రెండున్నర టీఎంసీల నీరు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు నాగార్జునసాగర్‌లో 529.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం 167.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 31,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
గేట్లు తెరుచుకున్న ఎగువ ప్రాజెక్టులు..
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో క్రస్ట్‌గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ముందస్తుగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టికి ఎగువ నుంచి 1.36 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అక్కడి నుంచి నారాయణపూర్‌కు 1.50లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి జూరాలకు 1.68లక్షలు, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.52లక్షలు, పక్కనే ఉన్న తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.44లక్షల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లోగా విడుదల అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తంగా 3.14లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీశైలం పూర్తిగా నిండితే త్వరలోనే క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు సాగర్‌కు విడుదల కానుంది.
వరద తగ్గి క్రస్ట్‌గేట్లు తెరుచుకోకపోయినా జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నిరంతరం 31వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరనుంది. గతంలో ఇలాగే పవర్ జనరేషన్ ద్వారా సుమారు 30అడుగుల మేర నీటిని నింపగలిగారు. అయితే.. జూలై రెండో వారంలోనే వరద వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో సాగర్ ఆయకట్టు రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సారీ ముందస్తుగానే నీటి విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో రెండు రాష్ర్టాల్లో కలిపి 11లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న విషయం తెలిసిందే.
సాగర్ రిజర్వాయర్ సమాచారం
నందికొండ, జూలై 16 : నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590(312 టీఎంసీలు) అడుగులకు గాను 529.50(167.1730 టీఎంసీలు) అడుగుల మేరకు నీటి నిల్వ ఉంది. కుడికాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, వరద, ఎస్ఎల్బీసీ కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి 18,018 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. అవుట్ ఫ్లో లేదు.
4 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
సూర్యాపేట రూరల్ : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 706.2 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు అడుగు మేర ఎత్తి 2192.2 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 638.40(2.85 టీఎంసీలు) అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.