యాదాద్రి, అక్టోబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసంతో పాటు శనివారం కావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి ప్రధానాలయంతో పాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే కొండపైన దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రత మండపం సందడిగా మారింది. యాదాద్రి కొండ కింద నూతన వ్రత మండపం, పాతగుట్టలో గల వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. 454మంది దంపతులు వ్రతమాచరించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.26,92,128 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ఆలయ ముఖ మండపంలో మణవాళ మహామునుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. రెండో రోజులో భాగంగా ఉదయం స్వామివారికి తిరువాయిమూడి అనుసంధానం చేపట్టారు. సాయంత్రం మణవాళ మహామునుల సేవను చేపట్టినట్టు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు తెలిపారు. నేడు పురప్పాట్ సేవతో తిరునక్షత్రోత్సవాలకు ముగింపు పలుకుతామని అన్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,59,850
వీఐపీ దర్శనాలు 1,20,000
వేద ఆశీర్వచనం 9,600
సుప్రభాతం 5,600
ప్రచారశాఖ 54,000
వ్రత పూజలు 3,70,700
కళ్యాణకట్ట టిక్కెట్లు 78,500
ప్రసాద విక్రయం 10,78,250
వాహనపూజలు 17,600
అన్నదాన విరాళం 1,19,746
సువర్ణ పుష్పార్చన 97,316
యాదరుషి నిలయం 93,016
పాతగుట్ట నుంచి 56,550
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
శివాలయం 14,500