తెలంగాణ ఉద్యమ సమయంలో మునగాలతోపాటు కృష్ణపట్టె ప్రాంతం అనేకమందికి స్ఫూర్తినిచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ చరిత్రను పరిశోధన చేసే క్రమంలో ఈ ప్రాంతాల్లో పర్యటించినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతపై ఇక్కడ నిర్వహించిన సమావేశాలు ఎంతో ధైరాన్ని అందించాయని తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు జితేంద్రబాబు తండ్రి రామచంద్రమూర్తి సంతాప సభ సోమవారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించగా, ఎమ్మెల్సీ కవిత హాజరై నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు వచ్చి జితేంద్రబాబు కుటుంబాన్ని ఓదార్చారు.
మునగాల, మే 16 : తెలంగాణ ఉద్యమానికి మునగాలతోపాటు కృష్ణపట్టె ప్రాంతం స్ఫూర్తినిచ్చిందని, తెలంగాణ చరిత్రను పరిశోధన చేస్తున్న క్రమంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చరిత్రకారుడు జితేంద్రబాబుతో తనకున్న సాన్నిహిత్యంతో ఇక్కడికి పలుమార్లు వచ్చినట్లు తెలిపారు. దివంగత శ్రీరామచంద్రమూర్తి ఆప్యాయతతో వారి ఇల్లు ఎంతోమంది ఉద్యమకారులకు రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతపై అవగాహన కల్పించిందని పేర్కొన్నారు.
సోమవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో చరిత్రకారుడు జితేంద్రబాబు తండ్రి శ్రీరామచంద్రమూర్తి సంతాప సభకు ఆమె హాజరై మాట్లాడారు. తొలుత శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తి మృతి తీరని లోటని పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భరత్, సినీ డైరెక్టర్ బి.నర్సింగ్‌రావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్లు, సూదిని పద్మనాభరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుంకర అజయ్ కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్ పాల్గొన్నారు.
కట్టంగూర్(నకిరేకల్) : మునగాలకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో వందలాది మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.