
నల్లగొండ, జూన్ 27 : టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు నీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను ప్రగతిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. అయితే.. గత ప్రాజెక్టుల మరమ్మతులు చేయించక పోవడంతో సాగు నీటి సరఫరాకు అంతరాయం కలిగి సాగు లక్ష్యం దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా పనిలో ఉండాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ శాఖను ఇరిగేషన్లో అంతర్భాగంగా ఏర్పాటు చేసి ప్రాజెక్టుల పర్యవేక్షణ చేపడుతుంది.
జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.7.59 కోట్లు..
జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జిల్లాకే మణిహారమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అందులో అంతర్భాగమైన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ), కరువు నేలను సస్యశ్యామలం చేసే డిండి లిఫ్ట్ ఇరిగేషన్తోపాటు ఆసిఫ్ నెహర్ కాల్వ మరమ్మతుల కోసం మొత్తంగా 7.59కోట్లు మంజూరు చేసింది. ఇందుకు గాను ఆయా ప్రాజెక్టుల పరిధిలో డీఈలు రూ.2లక్షల వరకు, ఈఈలు రూ.5లక్షలు, ఎస్ఈలు రూ.10 లక్షలు, సీఈలు రూ.2 కోట్లు, ఈఎన్సీ రూ.5కోట్ల వరకు పనులను బట్టి టెండర్లు పిలిచేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం 28 రకాల పనులను గుర్తించిన యంత్రాంగం వాటికి నేడో రేపో ఆన్లైన్లో టెండర్లు పిలిచి మూడు నెలల్లో మరమ్మతులు చేయించనున్నారు.
ప్రత్యేక శాఖతో నిత్యం పర్యవేక్షణ..
జిల్లాలోని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాల్సి వస్తే గతంలో ప్రభుత్వానికి నివేదించి సంబంధిత సీఈ ఆదేశాలతో పనులు చేపట్టేవారు. దీంతో ప్రాజెక్టుల్లో మరమ్మతులు చేయడానికి ఒక్కోసారి నెలల సమయం పట్టేది. కాలానుగుణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాటి పరిధిలోని ఆయకట్టుకు కొన్నిసార్లు నీళ్లు అందేది కాదు. దీన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ఈఎన్సీ పోస్టు క్రియేట్ చేసిన సర్కార్.. కింది స్థాయిలో సీఈలను ఏర్పాటు చేసింది. వారి ద్వారా ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టులను నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. అంటే ప్రతి ఏటా ఏ ప్రాజెక్టుకు అయినా మరమ్మతు చేయాల్సి వస్తే వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయించవచ్చు.
త్వరలో టెండర్లు పిలుస్తాం
జిల్లాలో ఉన్న ఎన్నెస్పీ, ఏఎమ్మార్పీ, డిండి ప్రాజెక్టులతోపాటు ఆసిఫ్ నెహర్ కాల్వ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.7.59 కోట్లు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిచి మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పని విలువను బట్టి డీఈ నుంచి ఈఎన్సీ వరకు టెండర్లు పిలువనున్నారు. ఇక ప్రతి ఏటా ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనుంది. ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయి.