
గ్రామంలో 1230 కుంటుంబాలకు సుమారు 7,234 జనాభా ఉంది. ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీకి నిధులు ఇస్తుండడంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. డీఎంఎఫ్టీ, జీపీ నిధులు రూ.40 లక్షలతో లక్ష్మీపురం, ఎస్సీ కాలనీలతోపాటు పలుచోట్ల డ్రైనేజీలు, రూ.12లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అంగన్వాడీ భవనం, లక్ష్మీపురంలో రూ.9లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు. రూ.20 లక్షల జీపీ నిధులు, రూ.ఐదు లక్ష ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, రూ.9లక్షలతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో నీటి సరఫరాకు, వీధిలైట్ల ఆన్‌ఆఫ్‌కు ఆటోమెటిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయాలు… కృష్ణా, మూసీ నదుల సంగమంతో అలరారుతున్న వాడపల్లి గ్రామం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మరింత సుందరంగా మారింది. ప్రకృతి వనం,వైకుంఠధామాలతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. దీంతో గ్రామం నేడు భక్తులతోపాటు పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నది.
ఆకర్షణీయంగా పల్లె ప్రకృతి వనం
గ్రామ ఆరంభంలోని రెండెకరాల భూమిలో రూ.8 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా రాతినేల కావడంతో స్థానిక ఇండియా సిమెంటు సహకారంతో నల్లమట్టితో రాతినేలను పూడ్చి అందులో మొక్కలను నాటారు. పూలు, పండ్ల మొక్కలతోపాటు ఆయుర్వేద మొక్కలను నాటారు. ఎనిమిది వేల మొక్కల మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి వాటర్ ఫాల్, లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళ ఈ పార్కు విద్యుత్ కాంతుల్లో ప్రత్యేకాకర్షణగా కనిపిస్తుంది. గ్రామస్తులు సాయంత్రం అందులో గడుపుతున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు కూడా ప్రకృతి వనాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఉపాధి హామీ కింద కూలీలను పెట్టి నీటిని అందిస్తున్నారు.
కృష్ణాతీరంలో వైకుంఠథామం
గ్రామ సమీపంలోని కృష్ణానదితీరంలో రూ.12.50 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. గ్రామస్తులకు అనుకూలంగా ఉండే విధంగా నీటి వసతి కల్పించి అందులో అందమైన మొక్కలను నాటారు. డంపింగ్ యార్డు, కంపోస్డ్ షడ్ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. పంచాయతీ ట్రాక్టర్‌తో ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లను ఇచ్చారు. కొత్తగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
అందానిస్తున్న హరితహారం
హరితహారం కార్యక్రమంలో గ్రామంలో మొక్కలను విరివిగా నాటారు. నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు 5 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకిరువైపులా రెండువేల మొక్కలను నాటారు. దీనితోపాటు మీనాక్షీఅగస్తేశ్వర స్వామి, లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాల వద్ద కూడా హరితహారంలో మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణకు ఉపాధి కూలీలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ట్యాంకర్ ద్వారా ప్రతి రోజూ మొక్కలను నీటిని అందిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు, వసతులను సద్వినియోగం చేసుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినం. హరితహారం మొక్కలను సంరక్షించడంతో నేడు గ్రామం మొత్తం పచ్చదనం పరుచుకుంది. మా పనితీరుకు గుర్తింపుగా మా గ్రామం జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికవడం సంతోషంగా ఉంది.
అభివృద్ధికి అనువైన ప్రదేశం కాకున్నా, పట్టుదలతో రాతినేలలో ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. ఇప్పుడు అందులో మొక్కలు పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. సీసీరోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామం ఇలా ప్రతి అభివృద్ధి పనిని వాడపల్లిలో ప్రత్యేకంగా చేపట్టాం. మంచి ఫలితాలు వచ్చాయి. హరితహారంలో నాటిన 80 శాతం మొక్కలు బతికి ఏపుగా పెరిగాయి.