
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 27 : హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజమండ్రి నుంచి తెప్పించిన 6 వేల మొక్కలు ఆదివారం మండల కేంద్రానికి చేరుకోగా వాటిని గ్రామపంచాయతీలకు పంపిణీ చేశారు. రోడ్ల వెంట నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటనున్నారు. దీంతో పాటు చిలకమర్రి నుంచి ఘూట్ నెమలిపురం వరకు 12కిలోమీటర్ల మేర జాతీయ రహదారికి ఇరువైపులా నాటేందుకు వీలుగా ఆయా గ్రామపంచాయతీలకు రెండు వేల మొక్కలు పంపణీ చేసినట్లు ఎంపీడీఓ యాదగిరి గౌడ్ తెలిపారు.
మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
మిర్యాలగూడ రూరల్ : ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మండలంలోని 46 గ్రామ పంచాయతీల్లో 3,46,682 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇండ్ల ఎదుట 1,64,892 మొక్కలు, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల వెంట 1,14,671, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 31,368 మొక్కలు నాటనున్నారు. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో 35,750 నాటాలని నిర్ణయించినట్లు ఎంపీడీఓ అజ్మీర దేవిక తెలిపారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు వీలుగా గుంతల తవ్వకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
5లక్షల మొక్కలు సిద్ధం
చందంపేట : హరితహారం కోసం మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో సుమారు 5 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీడీఓ రాములు నాయక్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగాయని, జూలై ఒకటో తేదీ నుంచి మొక్కలు నాటించనున్నట్లు పేర్కొన్నారు.