
నీలగిరి, జూలై 8 : కొత్త పురపాలక చట్టాన్ని అనుసరించే మున్సిపాలిటీల పరిధిలో లే అవుట్లకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. నల్లగొండ కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఓలతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్ బీపాస్ ద్వారా ఆన్లైన్లో ఉన్న లే అవుట్లకు పట్టణ ప్రణాళిక విభాగం పరిశీలన తర్వాత టాస్క్‌ఫోర్స్ కమిటీ అనుమతులు జారీ చేయాలన్నారు. పదెకరాల వరకు టెక్నికల్ స్క్రీనింగ్ తర్వాత జిల్లా స్థాయి కమిటీ ద్వారా, పదెకరాలకు మించితే డీటీసీపీ ద్వారా లేఅవుట్ అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేయాలని సూచించారు. లే అవుట్లో 10 శాతం ఓపెన్ ప్లేస్‌ను స్థానిక సంస్థల పేరున రిజిస్టర్ చేయాలన్నారు. 2019 జూలైకి ముందు, తర్వాత అన్ని లే అవుట్లకు అనుమతులు ఇచ్చారో రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎవరైనా భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టంచేశారు. లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతుతి లేని లే అవుట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా సర్వే నెంబర్‌తో సబ్ రిజిస్ట్రారుకు లేఖలు రాయాలని సూచించారు. పట్ణణాల్లో రహదారుల సెంట్రల్ మీడియన్, రోడ్ మార్జిన్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, స్థానిక సంస్థల ద్వారా విద్యా సంస్థలను శుభ్రం చేయాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు వేయాలని, ప్రతి రోజూ మున్సిపల్ వాహనాల్లో చెత్త నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీనూ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలం గుర్తించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహన్ ఉన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
పట్టణ ప్రగతిలో భాగంగా నల్లగొండ ఎస్ఎల్బీసీలో ఏర్పాటు చేసిన బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించారు. అనంతరం మర్రి గూడ బైపాస్ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కేంద్రియ విద్యాలయం వద్ద అర్బన్ నర్సరీని సందర్శించి సూచనలిచ్చారు.